చెన్నైలో మహేష్ పేల్చిన పంచులు..

0Mahesh-Babu-Spyder-Audio-Launchమహేష్ బాబు బాల్యమంతా చెన్నైలోనే గడిచిందన్న సంగతి తెలిసిందే. కాబట్టి అతడికి తమిళం తెలిసి ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ శనివారం రాత్రి ‘స్పైడర్’ ఆడియో వేడుక సందర్భంగా మహేష్ తమిళంలో మాట్లాడిన తీరు మాత్రం అద్భుతమనే చెప్పాలి. చెన్నైలో చాలా ఏళ్లు ఉండి వచ్చిన నందమూరి బాలకృష్ణ.. రాజమౌళి లాంటి వాళ్లు మాట్లాడిన తమిళం విన్నాం. కానీ మహేష్ ముందు వాళ్లందరూ దిగదుడుపే.

మాటల కోసం ఎంత మాత్రం వెతుక్కోకుండా చక్కటి స్పష్టమైన తమిళంలో మాట్లాడుతూ తమిళ జనాల మనసు దోచాడు మహేష్. ‘స్పైడర్’ సినిమాలో తమిళ డైలాగులు కూడా చాలా బాగానే పలికి ఉంటాడన్న భరోసా కలిగింది అతడి మాటలు చూస్తుంటే. ఇక తెలుగులో తన సినిమాల ఆడియో వేడుకలు జరిగినపుడు చాలా పొదుపుగా.. పొడి పొడిగా మాట్లాడే మహేష్ తమిళ ఆడియో వేడుకలో మాత్రం కొంచెం సుదీర్ఘంగా పంచులు పేల్చుతూ.. ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడటం విశేషం.

ఈ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన చిన్మయి మహేష్ ప్రసంగం ముగిసిన అనంతరం ఒక ప్రశ్న వేయడానికి రెడీ అయింది. ఐతే మహేష్ ఆమెను ఆపి.. ‘‘నువ్వు మాట్లాడుతుంటే సడెన్‌గా ఇదేంటి సమంత వచ్చేసింది అనుకున్నా’’ అంటూ పంచ్ వేశాడు. చిన్మయి తెలుగులో సమంతకు డబ్బింగ్ చెబుతుందన్న సంగతి తెలిసిందే. ఈ పంచ్‌తో ఆడిటోరియం హోరెత్తిపోయింది.

ఇక తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమాల్లో ఏదైనా ఒక పంచ్ డైలాగ్ చెప్పండి అని అడిగితే.. ఆ డైలాగ్ మరిచిపోలేనిది.. ‘తుపాకి’లోని ‘ఐయామ్ వెయిటింగ్’ అనే డైలాగ్ అంటూ మహేష్ ఫోర్స్‌గా ఆ డైలాగ్ చెప్పిన తీరు ఆకట్టుకుంది. ఇక ఎస్.జె.సూర్య గురించి మాట్లాడుతూ.. అతను దర్శకుడిగా తనతో పదేళ్ల కిందట ‘నాని’ సినిమా తీశాడని.. అతడి ఆలోచనలు ఎంత పెద్దగా ఉంటాయో తనకు తెలుసని.. క్లైమాక్స్ షూటింగ్ సందర్భంగా సూర్య తనను సీరియస్‌గా చూస్తూ కనిపించాడని.. అది చూసి తనకు నవ్వొచ్చేసిందని.. ఒకప్పుడు తామిద్దరం ఎలా ఉండేవాళ్లమో.. ఇప్పుడు మురుగదాస్ కారణంగా ఎలా అయిపోయామో అనిపించిందని మహేష్ గట్టిగా నవ్వాడు. ఈ మాటలన్నీ కూడా మహేష్ తమిళంలో మంచి ఫ్లోతో చెప్పడంతో అతడి ప్రసంగం తమిళ జనాల్ని భలేగా ఆకట్టుకుంది.