బాబోయ్.. గీత మరీ ఇంత అల్లరా?

0ఛలో’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక మందాన తెలుగులో రెండవ చిత్రం ‘గీత గోవిందం’తో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడికి కోటికి పైగా పారితోషికం ఇచ్చి తమ సినిమాల్లో బుక్ చేసుకునేందుకు పలువురు నిర్మాతలు క్యూ కట్టి మరీ ఉన్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ‘గీత గోవిందం’ చిత్రంలో గీత పాత్రకు అద్బుతంగా సెట్ అయ్యింది. 25 మంది హీరోయిన్స్ ను అడిగితే చివరకు రష్మిక ఒప్పుకున్నట్లుగా దర్శకుడు పరుశురామ్ చెప్పుకొచ్చాడు. ఆ 25 మంది హీరోయిన్స్ కూడా కుళ్లుకునే విధంగా రష్మి ఈ చిత్రంలో నటించి మెప్పించి – స్టార్ డంను దక్కించుకుంది.

‘గీత గోవిందం’ చిత్రంలో గీత పాత్ర చాలా సైలెంట్ అండ్ సీరియస్ గా కనిపించింది. హీరో గోవిందంకు ఎక్కడ మొగ్గకుండా తాను ప్రేమిస్తూ ఉన్నా కూడా ఆ విషయాన్ని చెప్పకుండా హుందాగా కనిపించిన గీత రియల్ లైఫ్ లో మాత్రం అలా కాదని కింది వీడియో చూస్తే అనిపిస్తుంది. గీత గోవిందం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సంవత్సరపు బిగ్గెస్ట్ సక్సెస్ చిత్రాల జాబితాలో ఇది చేరింది. 25 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

మేకింగ్ వీడియోలో రష్మిక చేసిన అల్లరి అందరిని అలరిస్తోంది. హీరో విజయ్ దేవరకొండ కంటే కూడా అధికంగా రష్మిక ఈ మేకింగ్ వీడియోలో వ్యూవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాలో సీరియస్గా కనిపించిన రష్మిక రియల్ లైఫ్లో చాలా జోవియల్గా ఉంటుందని ఈ వీడియో చూస్తుంటే అనిపిస్తుంది. రష్మిక తెలుగులో మూడవ సినిమా ‘దేవదాస్’ ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. నానికి జోడీగా నటించిన ఆ చిత్రంపై కూడా రష్మిక చాలా ఆశలు పెట్టుకుంది. ‘దేవదాస్’ చిత్రం విడుదలైన తర్వాత తన తదుపరి చిత్రాలను ఈమె ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.