మన వైయస్సార్ ‘ధ్రువ-2’ విలన్

0జయం రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన `తని ఒరువన్` తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రవి-మోహన్ రాజా బ్రదర్స్ పేరు మార్మోగిపోయింది. ఇదే చిత్రంతో ది గ్రేట్ అరవింద స్వామి రీఎంట్రీ ఇచ్చారు. వస్తూనే విలన్ గా అదరగొట్టేశాడు. మెడికల్ క్రైమ్ కి పాల్పడే సిద్ధార్థ అభిమాన్యు పాత్రలో అరవింద స్వామి క్లాస్ పెర్ఫామెన్స్ కట్టి పడేసింది. సాఫ్ట్ గా కనిపిస్తూనే వైల్డ్ గా బ్లేడ్ తో కోసేయడమెలానో అరవింద స్వామి విలనీ చూపించింది. జయం రవి క్లాస్ కాప్ రోల్ లో జీవించాడు. అందుకే ఆ సినిమాని తెలుగులో రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ధ్రువ` పేరుతో రీమేక్ చేశారు. ధ్రువ తెలుగులో హిట్. అటు చరణ్ కి – మరోసారి అరవింద స్వామికి ఇద్దరికీ మంచి పేరొచ్చింది.

ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీసేందుకు జయంరవి- మోహన్ రాజా టీమ్ ప్రిపరేషన్స్ లో ఉంది. ఇప్పటికే నయనతార – సయేషా సైగల్ లను కథానాయికలుగా ఎంపిక చేసుకున్నారు. ఇక ఇలాంటి క్రేజీ చిత్రంలో విలన్ గా ఎవరు నటించాలి? అని ఆరాతీస్తే .. ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి. పార్ట్ 1లో అరవింద స్వామి నటనను మించి చేసేవాడై ఉండాలి. ఎందుకంటే ఆ పాత్రతో జనం పోల్చి చూస్తారు. అయితే ఆ స్థాయిని మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇవ్వగలడని మోహన్ రాజా & టీమ్ భావిస్తున్నారట. అందుకే మమ్ముట్టిని కలిసి కథ వినిపించేందుకు రెడీ అవుతున్నారట.

మరోవైపు మమ్ముట్టి ప్రస్తుతం తెలుగులో వైయస్సార్ బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో `యాత్ర` ఆన్ సెట్స్ ఉంది. వైయస్ పాత్రలో మమ్ముట్టి లుక్కి స్పందన బావుంది. అందుకే తనిఒరువన్ 2 సినిమాకి మమ్ముట్టి ఓకే చెబితే – అటుపై చరణ్- సురేందర్ రెడ్డి `ధ్రువ 2` తీస్తే ఆయనే విలన్ గా నటించాల్సి ఉంటుందేమో?