మహిళా కానిస్టేబుల్ నెంబర్ పోర్న్ సైట్లో పెట్టాడు

0man-harasses-she-teams-cop-ఓ యువకుడు మహిళా కానిస్టేబుల్‌నే టార్గెట్ చేశాడు. షీ టీమ్స్‌‌కు చెందిన మహిళా కానిస్టేబుల్‌ ఫోన్‌ చేస్తే అతను కఠిన పదజాలంతో మాట్లాడాడు. ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపించాడు. వాటికి స్పందించకపోవడంతో ఆ కానిస్టేబుల్‌ ఫోన్‌ నెంబర్‌ను పోర్న్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశాడు.

అతన్ని షీటీమ్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో జరిగింది.రాచకొండ షీటీమ్స్‌ ఏసీపీ స్నేహిత ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా, పరకాల మండలం, సాగరవిడి గ్రామానికి చెందిన బీరం నిఖిల్‌కుమార్‌ ఇబ్రహీంపట్నంలో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు.

నిరుడు మంచాలలోని ఒక కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని మొబైల్‌ నంబర్‌కు అసభ్యకర సందేశాలు పంపాడు. ఫోన్‌ చేసి ఇబ్బందులకు గురిచేశాడు. బాధితురాలు గుర్తుతెలియని నంబర్‌ నుంచి అసభ్యకర సందేశాలు వస్తున్నాయని రాచకొండ వాట్సప్‌ నంబర్‌కు అక్టోబర్‌ 14, 2016న సందేశం పంపింది.

ఇబ్రహీంపట్నం షీటీమ్‌ ఏఎస్‌ఐ నర్సింహారెడ్డి ఆ విద్యార్థిని వద్దకెళ్లి ప్రాథమిక సాక్ష్యాలు సేకరించారు. రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేస్తామని భరోసా ఇచ్చారు. అయితే అతని మీద ఫిర్యాదు చేయటానికి బాధితురాలు ముందుకు రాలేదు.విచారణలో భాగంగా షీటీమ్‌ మహిళా కానిస్టేబుల్‌ అసభ్యకర సందేశాలు పంపిన నిఖిల్‌ కుమార్‌కు ఫోన్‌ చేశారు.

ఫోన్ చేసి వివరాలు అడుగుతున్న సమయంలో పరుష పదజాలంతో మాట్లాడాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె నెంబర్‌కు కూడా అసభ్యకరమైన సందేశాలు పంపాడు. పలుమార్లు కానిస్టేబుల్‌ హెచ్చరించినా కూడా అతడు వినలేదు. ఆగడాలు మితిమీరడంతో జనవరి 23న ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నిఖిల్‌ ఈ విషయం తెలుసుకుని పారిపోయాడు.

తన మీద కేసు పెడుతుందా అని కోపోద్రిక్తుడైన అతడు మహిళా కానిస్టేబుల్‌ను వేధించడం కొనసాగించాడు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ మహిళా కానిస్టేబుల్‌ ఫోన్‌ నంబర్‌ను పోర్న్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ఆమెకు అజ్ఞాత వ్యక్తుల నుంచి వందల ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. వారంతా అసభ్యకరంగా మాట్లాడి వేధించారు.

మనస్తాపం చెందిన మహిళా కానిస్టేబుల్‌ ఇబ్రహీంపట్నం పోలీసులకు విషయం చెప్పింది. షీటీమ్స్‌, పోలీసులు బీరం నిఖిల్‌కుమార్‌ను వరంగల్‌లో మంగళవారం అరెస్టు చేశారు. కేసును ఛేదించిన షీటీమ్స్‌ను రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ అభినందించారు. ఆకతాయిలు వేధిస్తే మహిళలు నిర్భయంగా వాట్సప్‌ నంబర్‌ 9490617111కు సందేశ రూపంలో ఫిర్యాదు చేయాలని సూచించారు.