చాలామంది చేతిలో మోసపోయా..మంచు లక్ష్మి!

0టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన తండ్రి మోహన్ బాబుతో పాటు తన ఫ్యామిలీ కార్డ్ ను వాడకుండానే….తనకంటూ మరింత ప్రత్యేకమైన గుర్తింపును మంచు లక్ష్మి సొంతం చేసుకుంది. `ఐరేంద్రి` పాత్రతో తెరంగేట్రం చేసిన మంచు లక్ష్మి …ఆ తర్వాత నటిగా – నిర్మాతగా – దర్శకురాలిగా….భిన్న పార్శ్వాలను ప్రదర్శిస్తోంది. నటిగానే కాకుండా `మేము సైతం` వంటి కార్యక్రమాలతో సమాజ సేవ కూడా చేస్తోంది. తాజాగా `వైఫ్ ఆఫ్ రామ్` తో మంచు లక్ష్మి మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లక్ష్మి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సినిమా తనను ఎప్పుడూ మోసం చేయలేదని మనుషులు మోసం చేయడం వల్ల నష్టపోయానని చెప్పింది. గతంలో కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించానని ఆ సమయంలో చేసిన అప్పులు ఇప్పటికీ తీరలేదని తెలిపింది. `వైఫ్ ఆఫ్ రామ్` విజయం సాధించి ….తన అప్పులన్నీ తీరాలని ఆకాంక్షించింది.

‘మేము సైతం’ అనే షో చాలామందికి ఉపయోగపడిందని ఆ షోలో పాల్గొన్న వారి కష్టాలు విని… ఆ బాధను తనలో నింపుకుంటున్నానని చెప్పింది. అయితే తాను బాధపడడం మోహన్ బాబుకు నచ్చడం లేదని – అందుకే ఆ షో చేయవద్దని చెప్పారని తెలిపింది.

‘గుండెల్లో గోదారి’ సినిమాతో అప్పులపాలయ్యానని వాటిని ఇప్పటికీ తీరుస్తూనే ఉన్నానని చెప్పింది. తాను తీసుకున్న ప్రతి రూపాయి తిరిగి ఇస్తానని – అప్పుల వల్లే మనశ్శాంతిగా నిద్రపోలేకపోతున్నానని చెప్పింది. తనకు డబ్బులు ఇవ్వాల్సినవారు చాలామంది ఉన్నారని – తనకు బకాయిపడ్డ 23 లక్షలు ఇవ్వకుండా ఓ వ్యక్తి వేరే పేరుతో సినిమాలు విడుదల చేస్తున్నారని చెప్పింది. మోహన్ బాబు గారి కూతురును ఎవరు మోసం చేస్తారని అనుకోవడం వల్లే చాలా మంది తనను సులభంగా మోసం చేశారని తెలిపింది. తనను ఏమైనా అంటే తన్నడానికి ముగ్గురున్నారని – కానీ తన్నడాన్ని కూడా మీడియా రకరకాలుగా చూపిస్తోందని చెప్పింది. ఇపుడు సినీ కెరీర్ 6-10 సంవత్సరాలు ఉంటేనే గొప్ప అని చెప్పింది. అందుకే సినిమాలతోపాటు వ్యాపారం చేయాలని….ప్రస్తుతం జూనియర్ కుప్పన్న హోటల్ బిజినెస్ లోకి దిగానని చెప్పింది.