కేసీఆర్ కు మద్దతు ప్రకటించిన హీరో

0సీఎం కేసీఆర్ నిన్న అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే.. అనంతరం ముఖ్యమంత్రి నుంచి ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మారిపోయారు. కేసీఆర్ ఇచ్చిన ఈ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే అందరూ కోలుకుంటున్నారు. అయితే ఎన్నికలపై ఎంతో ప్రభావం చూపే తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రం ఇప్పటివరకూ కేసీఆర్ నిర్ణయంపై స్పందించలేదు. ఏ హీరో సినీ ప్రముఖుడు కూడా కేసీఆర్ నిర్ణయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు.

కానీ ఒకే ఒక్కడు కేసీఆర్ చేసిన పనిపై మనస్ఫూర్తిగా స్పందించాడు. కేసీఆర్ రాజీనామా చేశాక బహిరంగంగా మద్దతు ప్రకటించిన హీరో మంచు మనోజ్ మాత్రమే. మనోజ్ మాట్లాడుతూ.. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ మరిన్ని ఎక్కువ సీట్లు సంపాదించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. మంచు మనోజ్ టీఆర్ ఎస్ కు మద్దతుగా చేసిన ఈ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

అయితే మరే సినిమా ప్రముఖుడు కూడా కేసీఆర్ నిర్ణయంపై ఇప్పటివరకూ స్పందించిన దాఖలాలు లేవు. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ ఏదైనా ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆది నుంచి టీడీపీ సపోర్టుగా ఉండే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య వైసీపీకి కూడా మద్దతు పలుకుతోంది. పలువురు వైసీపీ పార్టీలో చేరి ఏపీలో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉంటున్న సినీ పెద్దలు తెలంగాణ రాజకీయాల్లో ఏదైనా ఓ స్టెప్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆది నుంచి సినీ ప్రముఖులు తెలంగాణ రాజకీయాలపైన ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడే మద్దతు ప్రకటిస్తే ఫలితాల్లో తేడా వస్తే వచ్చే ప్రభుత్వంతో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని అందరూ సైలెంట్ గా ఉంటున్నారు. తెలంగాణలో రాజకీయంగా ఎటువంటి ఆసక్తి లేని సినీ పెద్దలు అనవసరంగా ఇక్కడ జోక్యం చేసుకుంటే ఇబ్బందులు ఏర్పడుతాయని భావిస్తున్నారు. అందుకే ఇప్పటివరకూ ఎవ్వరూ నోదుపెదపడం లేదు. కానీ మంచు మనోజ్ మాత్రం ఓపెన్ హార్ట్ గా జెన్యూన్ గా కేసీఆర్ గెలుస్తారంటూ ప్రకటించడంతో మిగతా సినీ పెద్దలు ఇప్పుడు పునరాలోచనలో పడిపోయారు.