ఆ సర్వే నన్ను కలచి వేసింది:మనోజ్

0ప్రపంచంలోని పలుదేశాల్లో మహిళల రక్షణపై లండన్ కు చెందిన `థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్` నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక సంస్థ చేపట్టిన సర్వేలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అత్యాచారం – వైవాహిక అత్యాచారం – లైంగిక దాడి – హింస – శిశువుల హత్య…..వంటి ఎన్నో ఘెరాలు భారత్ లో నిత్య కృత్యమయ్యాయని ఆ సర్వేలో తేలింది. మహిలపై విపరీతమైన ఆంక్షలు – వేధింపులు ఉండే అఫ్ఘానిస్తాన్ – సిరియా – సోమాలియా – సౌదీ అరేబియా వంటి దేశాలను తోసిరాజని….భారత్ మొదటి స్థానంలో నిలవడం తీవ్రంగా కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సర్వేపై పలువురు సామాజిక కార్యకర్తలు – మహిళా సంఘాలు – సెలబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ సర్వేపై టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ స్పందించారు. భారత్ లో మహిళలకు రక్షణ కరువవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ మనోజ్ ట్వీట్ చేశాడు.

టాలీవుడ్ హీరో మంచు మనోజ్….సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు సామాజిక అంశాలపై కూడా మనోజ్ తనదైన శైలిలో స్పందిస్తుంటాడు. తాజాగా రాయిటర్స్ సర్వేపై కూడా మనోజ్ స్పందించాడు. ఆ సర్వే ఫలితాలు తనను కలచివేశాయని మనోజ్ ఆవేదన వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. “ ఆ సర్వేలో భారత్ అగ్రస్థానంలో ఉండడం చాలా బాధాకరం. ఈ పరిస్థితి మారాలి. భారత్ మహిళలకు సురక్షితమైన దేశంగా మార్చేందుకు మనందరం బాధ్యత వహించాలి. ప్రస్తుత పరిస్థితిలో కచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉంది` అని మనోజ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం మనోజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.