ఆ కెమెరా విష్ణు కి దొరికేసింది

0ఎంత వారసత్వంతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టినా మనకంటూ ఒక పేరు తెచ్చుకోవడం అనేది అంత సులభం అయిన విషయం ఏమి కాదు. ఎన్నో ఆటుపోట్లను భరించాల్సి వస్తుంది. కెరీర్ లో అలాంటి ఎత్తు పల్లాలను ఎన్నో చూసిన హీరోల్లో మంచు విష్ణు ఒకడు. 2003 లో విష్ణు సినిమాతో అరంగేట్రం చేసిన ఈ మంచు వారబ్బాయి దాదాపు 15 సినిమాలు చేసినప్పటికీ అందులో ఢీ మాత్రం ప్రత్యేకం.

విష్ణు కు చాలా పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా అది. 2007 లో విడుదలైన ఆ సినిమా కామెడీ పరంగా చెప్పుకోవాలంటే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి పెద్ద హిట్టే అయింది. ఇప్పుడు అదే సినిమా ను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడు ఈ మంచు హీరో. ఆ సినిమా షూట్ చేసిన కెమెరా ను ఇతను చాలా కాలంగా వెతుకుతుండగా ఇప్పటికి దొరికిందట. ఆ విషయాన్ని సోషల్ మీడియా లో ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు విష్ణు. “చాలా కాలం వెతికిన తరువాత మొత్తానికి దొరికింది. ఈ కెమెరా తోనే ఢీ సినిమా షూట్ చేయడం జరిగింది. ఆ సినిమాతో నాకు బోలెడు జ్ఞాపకాలు ఉన్నాయి. మీకు అందులో నచ్చిన సన్నివేశం ఏంటి?” అంటూ ట్వీట్ చేయగా ప్రేక్షకులు వాళ్ళకి నచ్చిన సీన్ గురించి కామెంట్లు పెడుతున్నారు.

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఢీ సినిమాకు కోన వెంకట్ కథను అందించారు. శంకర్ యాదవ్ నిర్మించిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో విష్ణు జెనీలియా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సంవత్సరం విడుదలైన మోహన్ బాబు నటించిన సినిమా గాయత్రి లో విష్ణు కూడా కనిపించాడు. విష్ణు హీరోగా వచ్చిన ఆచారి అమెరికా యాత్ర పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఓటర్ అనే సినిమాతో త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి.