ఓటర్ వివాదం జటిలంగా మారుతోందే

0

హీరో మంచు విష్ణు నటించిన ‘ఓటర్’ చిత్రం ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు తరఫున ఆయన స్నేహితడు విజయ్ కుమార్ రెడ్డి ‘ఓటర్’ నిర్మాత పూదోట సుధీర్.. దర్శకుడు కార్తీక్ రెడ్డి లను రూ. 1.5 కోట్లు ఇవ్వాలని నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ‘అసెంబ్లీ రౌడీ’ ఆధారంగా ‘ఓటర్’ సినిమాను తెరకెక్కించారని అందుకు రైట్స్ తీసుకోవడానికి 1.5 కోట్లు హీరో మంచు విష్ణుకు చెల్లిస్తానని చెప్పి నిర్మాత దర్శకులు ఇప్పుడు మాట తప్పారని విష్ణు తరఫు వాదన.

విష్ణు వర్గం హైదరాబాద్ సిటీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసి నోటీసులు పంపారు. అయితే దీనికి స్పందనగా దర్శకుడు కార్తీక్ రెడ్డి తెలుగు సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఒక లేఖ రాశారు. ఇందులో ఆయన వెర్షన్ వినిపిస్తూనే మంచు ఫ్యామిలీ నుండి తనకు ప్రాణహాని ఉందని తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. మంచు విష్ణు తో ‘సరదా’ అనే సినిమాకు కార్తీక్ రెడ్డి గతంలో దర్శకత్వం వహించాడట. కానీ ఆ సినిమాను ఆర్థిక కారణాల వల్ల పూర్తి చేయలేక పోయారట. తర్వాత దాసరి నారాయణరావు గారి కథ ‘సూరీడు’ ను విష్ణు.. మోహన్ బాబుల తో ‘సేనాపతి’ గా తెరకెక్కించాలని ప్రయత్నించాడట. కానీ మోహన్ బాబు.. విష్ణుల మితిమీరిన జోక్యం వల్ల ఆ సినిమా నుండి బైటకు వచ్చాడట.

ఆ తర్వాత ‘ఓటర్’ సినిమాను మొదలు పెట్టారట. ఈ సినిమాలో కూడా విష్ణు ఎక్కువగా జోక్యం చేసుకున్నారని కొందరు సీనియర్ రైటర్లను తీసుకొచ్చి వారు సూచించిన విధంగా సీన్లు మార్చాలని ఒత్తిడి చేశారట. గతంలో ఒక సినిమా ఆగిపోయింది కదా అనే ఉద్దేశంతో రాజీపడి వారు చెప్పినట్టు మార్పులు చేశానని తెలిపాడు. కానీ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత బయ్యర్లు ఎవరూ కొనేందుకు ముందుకు రాకపోవడంతో ప్రొడ్యూసర్లు చేతులేత్తేశారని అన్నాడు. అయితే ఆ సమయంలో తప్పుడు అగ్రిమెంట్పై స్క్రీన్ ప్లే కోసం రూ.1.5 కోట్లు ఇచ్చేలా బలవంతంగా తనతో సంతకం చేయించుకొన్నారని తెలిపాడు. ఆఖరికి డాక్యుమెంట్లు కూడా తనకు ఇవ్వకుండా మోసం చేశారని వాపోయాడు.

అంతే కాదు.. “ఓటర్ సినిమాకు అసెంబ్లీ రౌడీకి ఎలాంటి సంబంధం లేదు. నాకు ఎలాంటి హాని జరిగినా.. అందుకు మంచు మోహన్ బాబు. మంచు విష్ణు.. విజయ్ కుమార్ రెడ్డిదే బాధ్యత. ఇలాంటి జరుగకుండా నాకు రక్షణ కల్పించాలని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్స్కు లేఖ రాస్తున్నాను” కార్తీక్ రెడ్డి తెలిపాడు.
Please Read Disclaimer