విడాకులు తన తప్పేనన్న మనీషా

0manisha-koirala-familyమనీషా కొయిరాల. ఈ పేరు విన్న వెంటనే నాటి కుర్రకారు గుండెల్లో అలజడి చెలరేగేది. ఆమెను తెర మీద చూసిన ప్రతిసారీ ఊహాలోకాల్లో విహరించేవారు. మనీషాలాంటి అమ్మాయి జీవితంలో ఉంటే.. అంతకు మించి కావాల్సిందేమన్నది తొంభైల నాటి కుర్రకారు కల. ఆమెను చూసి.. పేజీలకు పేజీల కవిత్వాన్ని పొంగి పొర్లించేవారు. అంతటి అందం ఆమె సొంతం. ముట్టుకుంటే మాసిపోయేంత అందం. కళ్లల్లో కనిపించే అమాయకత్వం కోసం.. దాన్ని సొంతం చేసుకునేందుకు జీవితాన్నైనా పణం పెట్టాలని ఫీలయ్యేవారు నాటి కుర్రకారు.

అంతటి అందం 2010లో పెళ్లి చేసేసుకుంది. చాలామంది హీరోయిన్ల మాదిరే వ్యాపార వేత్త సమ్రాట్ ను పెళ్లి చేసుకున్న ఆమె..కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అతనితో విడిపోయింది. మనీషా పెళ్లి.. విడాకులు రెండూ సంచలనాన్ని సృష్టించాయి. ఆ తర్వాతి కాలంలో ఆమె క్యాన్సర్ బారిన పడటం.. ఆ మహమ్మారిపై పోరాడి విజయం సాధించిన ఈ మల్లెమొగ్గ.. మళ్లీ తన సెకండ్ ఇన్సింగ్స్ను షురూ చేసింది.

తాజాగా ఆమె.. డియర్ మాయా చిత్రంతో మళ్లీ వెండి తెర మీద కనిపించనుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె మీడియాను కలిశారు. ఈసందర్భంగా తన వ్యక్తిగత విషయాలపై ఆమె ఓపెన్ అయ్యారు. ఫేస్ బుక్ తో ఒకరినిఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లు చెప్పిన మనీషా.. తన పెళ్లి విడాకుల వరకూ వెళ్లటానికి కారణం తానేనని చెప్పింది.

విడాకుల విషయంలో సమ్రాట్ తప్పేమీ లేదని.. అదంతా తన తప్పేనని చెప్పింది. పెళ్లి విషయంలో మిగిలిన వారి మాదిరే ఎన్నో కలలు కన్నానని.. కానీ.. ఆ అనుబంధం సరైనది కానప్పుడు విడిపోవటమే మంచిదని భావించినట్లుగా ఆమె వెల్లడించారు. ఇవాల్టి రోజున తప్పు చేసి మరీ.. దాన్ని ఎదుటోడి మీద నెట్టేసే టాలెంట్ ఉన్న వేళలో.. తప్పంతా తనదేనని ఒప్పేసుకోవటం మనీషా లాంటి కొందరికి మాత్రమే సాధ్యమవుతుందేమో?