మాకు తల్లిపాత్రలు..హీరోలకు మాత్రం రోమాన్సా.?

0బాలీవుడ్ లో ఒకప్పుడు వెలుగువెలిగిన హీరోయిన్ మనీషా కోయిరాలా.. దాదాపు అగ్ర హీరోలందరితో సినిమాలు చేసిన ఈమె కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా జరిగింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. తాజాగా డియర్ మాయా – లస్ట్ స్టోరీస్ చిత్రాల్లో నటించి రీఎంట్రీని ఘనంగా చాటింది. తాజాగా స్టార్ హీరో సంజయ్ దత్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కుతున్న సంజు సినిమాలో హీరో తల్లిపాత్రలో మనీషా కొయిరాలా నటించింది. ప్రస్తుతం వరుస సినిమా చాన్సులతో మనీషా దూసుకుపోయింది.

తాజాగా మనీషా కొయిరాలా తన సినిమా చాన్సులపై ఆవేదన వ్యక్తం చేసింది. షారుఖ్ ఖాన్ – సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో నటించిన ఈమెకు ఇప్పుడు తల్లి పాత్రలే వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘మాలో కొంతమంది పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ నుంచి కొంచెం పక్కకు తప్పుకొని మళ్లీ తిరిగి వచ్చాము. మేం నటించిన సినిమాలలో హీరోలు మాత్రం ఆపకుండా ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. నిజాయితీగా మాట్లాడుకుంటే ఆ హీరోలు ఇప్పటికీ 20 ఏళ్ల అమ్మాయిలను హీరోయిన్లుగా పెట్టి సినిమాల్లో నటిస్తున్నారు. కానీ మేము మాత్రం 40 దాటగానే తల్లిపాత్రలకే పరిమితమైపోతున్నాం. ఇది నేను ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాను..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ మధ్యనే మనీషా లస్ట్ స్టోరీస్ అనే వెబ్ ఫిలింలో భర్త ఫ్రెండ్ తో సంబంధం పెట్టుకునే ఒక భార్య పాత్రలో నటించింది. ఇలాంటి బోల్డ్ పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘ఇప్పటి జనరేషన్లో గొప్ప విషయం ఏంటంటే నన్నెవరూ నా మొహం మీద ముడతలు గురించి ఆరా తీయలేదు. అవి వయసులో కామనే అని వాళ్లు అర్థం చేసుకున్నారు. ఇది ఒక మంచి స్టార్ట్ ’ అని వెల్లడించింది.