మాజీ ప్రధాని కుమార్తెకు కీలక బాధ్యతలు

0maryam-nawaz-campaign-in-laపాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె కీలక బాధ్యతలు భుజాన వేసుకున్నారు. పనామా పత్రాల లీక్‌నకు సంబంధించి ఇటీవల కోర్టు తీర్పుతో నవాజ్‌ షరీఫ్‌ పదవీచ్యుతుడైన విషయం తెలిసిందే. ఆయన ఎన్నికైన లాహోర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన సతీమణి కుల్సూం ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఆమె గొంతు సంబంధిత కేన్సర్‌తో లండన్‌లో చికిత్స పొందుతున్నారు.

అనారోగ‍్యం కారణంగా ఆమె ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదని పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ వర్గాలు చెప్పాయి. దీంతో కుల్సూం తరఫున ఆమె కుమార్తె మరయం నవాజ్ (43) ప‍్రచార బాధ్యతలు చేపడతారని ఆ పార్టీ నేతలు తెలిపారు. వచ్చే నెల 17న జరిగే ఈ ఎన్నికకుగాను మరయం నేటి (శనివారం) ఉదయం నవాజ్‌ షరీఫ్‌ నివాసం నుంచి ప్రచారం ప్రారంభించారు. ఆమె వెంట పార్టీ నేతలు పర్వేజ్‌ మాలిక్‌, పర్వేజ్‌ రషీద్‌తోపాటు లాహోర్‌ మేయర్‌ పాల్గొన్నారు. ఒకవేళ కుల్సూం ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా ఉన్న షాహీద్‌ ఖాకన్‌ అబ్బాసీ స్థానంలో నియమితులయ్యే అవకాశం ఉంది.