రానాను ఇరుకున పెట్టిన బెజవాడ మీడియా!

0


Rana-Over-Drugs-Case-In-Vijఎవరెన్ని చెప్పినా ఒక మాట మాత్రం నిజం. సామాన్యుడి మొదలు ప్రముఖుడి వరకూ ఎవరైనా సరే.. ఆకాశానికి ఎత్తేసినా.. పాతాళానికి తొక్కేసినా మీడియాకు కుదిరినంత బాగా మరెవరికీ సాధ్యం కాదనే చెప్పాలి. రూపాయి ఖర్చు లేకుండా తమ అక్షరాలతో ఇమేజ్ తెచ్చి పెట్టే శక్తి పాత్రికేయుల సొంతం. అందుకే.. సమాజంలో చాలానే రంగాలు ఉన్నా.. మిగిలిన రంగాలకు భిన్నమైన ఛరిష్మా మీడియా సొంతంగా చెప్పాలి. అందుకే.. చాలామంది మీడియా దగ్గర ఆచితూచి మాట్లాడతారు. తొందరపడి నోరు పారేసుకోరు.

అలా పారేసుకునే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. మీడియాలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సీరియస్ మీడియా అయితే.. మరొకటి ఎంటర్ టైన్ మెంట్ మీడియా. సీరియస్ మీడియాకు చెందిన పాత్రికేయులు వేసే ప్రశ్నలు అంత సులువుగా ఉండవు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మొదటికే మోసం రావటం ఖాయం.

కానీ.. ఎంటర్ టైన్ మెంట్ పాత్రికేయులు వ్యవహారం కాస్త భిన్నం. వారి తీరుకాస్తంత లైటర్ వీన్ గాఉంటుంది. ఈ పాత్రికేయులు ఎక్కువగా సినిమా.. లైఫ్ స్టైల్ లాంటి కార్యక్రమాల్ని కవర్ చేస్తుంటారు. హైదరాబాద్ లో మినహా.. మిగిలిన ఊళ్లల్లో సినిమాకు.. లైఫ్ స్టైల్కు ప్రత్యేకమైన పాత్రికేయులు ఉండరు. అందుకే.. సినిమా వాళ్లు హైదరాబాద్ కాకుండా మరే ఊరికి వెళ్లినా.. అక్కడి పాత్రికేయుల ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు.

తాజాగా అలాంటి పరిస్థితి రానాకు ఎదురైందని చెబుతున్నారు. ఆయన తాజాగా నటించి.. ఈ శుక్రవారం విడుదల కానున్న నేనే రాజు.. నేనే మంత్రి సినిమా ప్రమోషన్ లో భాగంగా బెజవాడకు వెళ్లారు. అక్కడి మీడియా దెబ్బకు రానా ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా చెబుతున్నారు. తన సినిమా ప్రమోషన్ కోసం గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ లో పలువురు మీడియా ప్రతినిధుల్ని కలిసినప్పటికీ ఎదురుకాని ఇబ్బందికర పరిస్థితి.. బెజవాడలో ఎదురైందని చెబుతున్నారు.

సినిమా ప్రమోషన్ కోసం బెజవాడకు వెళ్లిన రానాను అక్కడి పాత్రికేయులు డ్రగ్స్ కేసు గురించి రియాక్ట్ కావాలని అడిగాడు. శుభమా అని సినిమా ప్రమోషన్ లో ఉన్న రానాకు.. డ్రగ్స్ మాట ఎత్తేసరికి ఒక్కసారి మౌనంగా మారి.. నో కామెంట్ అని అనేశారట. డ్రగ్స్ వ్యవహారం మీద తాను మాట్లాడలేనని చెప్పేశారట. ఆ అంశం గురించి తాను పట్టించుకోనని.. తన పనేదో తాను చేసుకుపోతానే తప్పించి.. మరింకేమీ పట్టదని చెప్పేసి.. తర్వాత ప్రశ్న ఏమిటని అడిగారట. మొత్తంగా.. బెజవాడ మీడియా రానాను ఇబ్బంది పెట్టిందన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.