అందమైన అబద్దాన్ని పరిచయం చేశారుగా

0Megha-Akash-look-in-Nithin-LIE-Movieనయనతార.. నిత్యా మీనన్.. అమలా పాల్.. నివేదా థామస్.. అనుపమా పరమేశ్వరన్.. అను ఎమ్మానుయేల్.. వీళ్లందరూ మల్లూ కుట్టీలైతే.. త్రిష.. సమంత.. మొదలు స్టారీమణులు అందరూ కూడా తమిళ సుందరాంగులు. ఎప్పుడూ టాలీవుడ్ లో బొంబాయి భామలకంటే వీరి హడావుడే ఓ రకంగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇదే కేటగిరీలోకి మరో అందమైన అబద్దం కూడా వస్తోంది.

నితిన్ హీరోగా ‘లై’ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా అంతా అమెరికాలోనే జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక అందమైన ప్రేమను.. ‘లై’లో ఉన్న ఆ ప్రేమను పరిచయం చేస్తున్నాం అంటూ హీరోయిన్ ముఖం కనిపించకుండా ఒక పోస్టర్ ను మొన్ననే రిలీజ్ చేశారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆ హీరోయిన్ ను కూడా పరిచయం చేశారు. ఆ అందమైన అబద్దం పేరే మేఘా ఆకాష్. ఈ 21 ఏళ్ళ తమిళ సుందరి ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఓనమాలు దిద్దుకుంటుంది. వచ్చీ రావడమే తమిళంలో రెండు సినిమాలు.. తెలుగులో రెండు సినిమాలు సైన్ చేసింది. ఆ విధంగా నితిన్ ‘లై’ ద్వారా తొలిసారి ఈ యంగ్ హాటీని తెలుగువారు చూస్తున్నారు.

ఇకపోతే హను రాఘవపూడి గత సినిమాల ద్వారా పరిచయమైన హీరోయిన్లు అందరూ కూడా సినిమాలు యావరేజిగా ఆడినా ఫ్లాపైనా కూడా బాగానే పేరు సంపాదించారు. అందాల రాక్షసితో వచ్చిన లావణ్య త్రిపాఠి.. కృష్ణగాడి వీర ప్రేమగాధతో పరిచయమైన మెహ్రీన్ కౌర పీర్జాదా.. ఇద్దరూ కూడా ఒక్క సినిమాకే పాపులర్ అయిపోయి బిజీ అయిపోయారు కూడా. ఇప్పుడు మేఘా ఆకాష్ కూడా అదే బాటలో వెళ్తుందేమో చూడాలి.