మెంటల్ మాది లో రివ్యూ

0mental-madhi-loఒకప్పటితో పోలిస్తే సినిమాను చూసే విషయంలో ప్రేక్షకుడి దృష్టికోణం పూర్తిగా మారిపోయింది. నాలుగు ఫైట్‌లు.. నాలుగు పాటలకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. కథలో కొత్తదనం లేకుండా సినిమా తీస్తే, అది స్టార్‌ హీరో సినిమా అయినా, ప్రేక్షకులు దానిని నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారు. కమర్షియల్‌ హంగులకు దూరంగా, ఆహ్లాదకర సన్నివేశాలతో నడిచే చిన్న సినిమా అయినా, దానికొ బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు ఉదాహరణ ‘పెళ్లిచూపులు’. ఈ చిత్రం న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీలకు దారి చూపిందనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే కథానాయకుడిగా ఎదుగుతూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు శ్రీవిష్ణు. ఆయన నటించిన చిత్రం ‘మెంటల్‌ మదిలో’. మరి ఈ చిత్రం శ్రీవిష్ణు కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించిందా?. కొత్త దర్శకుడు వివేక్‌ ఆత్రేయ తొలి ప్రయత్నం ఎలా ఉంది?

కథేంటంటే:

అరవింద్‌ కృష్ణ(శ్రీవిష్ణు)ది చిన్నప్పటి నుంచి ఓ కన్‌ఫ్యూజన్‌ మైండ్‌. అతడికి ఏం కావాలో అతనికే స్పష్టత ఉండదు. ఏదైనా రెండు వస్తువుల్లో ఒక దానిని ఎంచుకోవాల్సి వస్తే తికమక పడిపోతుంటాడు. అమ్మాయిలంటే మహా సిగ్గు. నేరుగా వారితో మాట్లాడలేడు. అలాంటి వ్యక్తికి స్వేచ్ఛ(నివేదా పేతురాజు)తో పెళ్లి కుదురుతుంది. స్వేచ్ఛ స్వతంత్ర భావాలున్న అమ్మాయి. తనకు ఏం కావాలో ఆమెకు బాగా తెలుసు. అరవింద్‌ కృష్ణను చాలా ఇష్టపడుతుంది. అతడి మైండ్‌ సెట్‌ని మార్చడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. నిశ్చితార్థానికి ముహూర్తం కూడా పెట్టుకుంటారు. అదే సమయంలో అరవింద్‌ కృష్ణకు ముంబయి ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ముంబయి వెళ్లాక కృష్ణలో అనుకోని మార్పు వస్తుంది. రేణు పరిచయంతో అరవింద్‌ కథ పూర్తిగా మారిపోతుంది. ఇంతకీ రేణు ఎవరు? ఆమె వల్ల వచ్చిన మార్పులేంటి? అరవింద్‌ కృష్ణ-స్వేచ్ఛల కథ చివరికి సుఖాంతమైందా? లేదా? అనేది సినిమా!

ఎలా ఉందంటే:

చాలా చిన్న లైన్‌. దాన్ని రెండు గంటల పాటు సినిమాగా మలచడం చాలా కష్టం. దర్శకుడు ఆత్రేయ దాన్ని సులభంగా దాటేశాడు. అరవింద్‌ కృష్ణ, స్వేచ్ఛ, రేణు ఈ మూడు పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయి. అందులోనే వైవిధ్యం చూపించాడు. అరవింద్‌-స్వేచ్ఛల మధ్య నడిచే సన్నివేశాలు చాలా అందంగా, సహజంగా చెప్పాడు దర్శకుడు. కథలో అద్భుతమైన మలుపులు, షాకింగ్‌ విషయాలు ఏవీ ఉండవు. చాలా ఆహ్లాదంగా, ఓ పడవ ప్రయాణంలా సాగిపోతుంది. రేణు వచ్చాక ఎలాంటి మార్పులు వచ్చాయన్నదే ఈ కథకు కీలకం. అప్పటి వరకూ స్వేచ్ఛ పాత్రను ప్రేక్షకుడు బాగా ఇష్టపడతాడు. రేణు పాత్ర కథలో ప్రవేశించడంతో కాస్త కుదుపు వస్తుంది. కానీ, క్రమంగా రేణు పాత్రను కూడా ఇష్టపడతాడు. అంతలా ఆయా పాత్రలను డిజైన్‌ చేసుకున్నాడు దర్శకుడు. ఏ సన్నివేశం బలవంతంగా ఇరికించిన భావన ఉండదు. ప్రతి సన్నివేశాన్నీ చాలా సహజంగా చూపించాడు. పాత్రల మధ్య సంఘర్షణ, వారి మధ్య సంభాషణల్లో ఎక్కడా నాటకీయత ఉండదు. అంతా మన పక్కంట్లో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. దాంతో ఆయా సన్నివేశాలకు తొందరగా చేరవవుతాడు ప్రేక్షకుడు. ద్వితీయార్ధం ప్రారంభంలో కథ కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. క్రమంగా రేణు పాత్రను ప్రేక్షకుడు ఎప్పుడైతే ఇష్టపడటం మొదలు పెట్టాడో.. మళ్లీ కథలోకి వెళ్లిపోతాడు. పతాక సన్నివేశాలు ఈ కథకు న్యాయం చేశాయి. కాస్త ఫన్‌, కాస్త ఎమెషన్‌, కాస్త రియలిస్టిక్‌ కలిపి ఓ చక్కటి ముగింపు ఇచ్చాడు దర్శకుడు. ‘పెళ్లి చూపులు’ సినిమా తర్వాత న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వారిందరికీ ‘మెంటల్‌ మదిలో’ నచ్చుతుంది.

ఎవరెలా చేశారంటే:

ఈ కథకు మూడు పాత్రలు కీలకం. శ్రీ విష్ణు, నివేతా పేతురాజు, రేణు. ఆ మూడు పాత్రలకు న్యాయం చేసే నటులను తీసుకున్నాడు దర్శకుడు. ఎవరి నటనా అసహజంగా అనిపించదు. శ్రీవిష్ణుకు తప్పకుండా ఇదో మంచి సినిమా అవుతుంది. నివేతాకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయి. రేణు పాత్రలో విద్యాబాలన్‌ పోలికలు కనిపిస్తాయి. చూడగానే ఆకట్టుకునేలా లేకపోయినా ఆ పాత్ర గుర్తుండిపోతుంది. చాలా రోజుల తర్వాత శివాజీరాజా ఓ మంచి పాత్రలో నటించారు. ఒక మధ్య తరగతి తండ్రిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో శివాజీరాజా నటనే నవ్వులు పంచుకుంది.

సాంకేతికంగా.. దర్శకుడి పనితనం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఒక సింపుల్‌ కథను అందరికీ అర్థమయ్యేలా మలిచాడు దర్శకుడు. నవతరం దర్శకులు ఎలా ఆలోచిస్తున్నారు? అనేదానికి ‘మెంటల్‌ మదిలో’ ఒక ఉదాహరణలా నిలుస్తుంది. దర్శకుడికి సంగీతంపై కూడా పట్టున్నట్లు కనిపిస్తుంది. నేపథ్య సంగీతం సన్నివేశానికి అనుగుణంగా సాగడమే అందుకు నిదర్శనం. అద్భుతమైన ఫొటోగ్రఫీ వల్ల ఈ చిత్రం చిన్న సినిమాలా ఎక్కడా అనిపించింది. సంభాషణల్లో పంచ్‌లు, ప్రాసలు లేకుండా చాలా సహజంగా ఉన్నాయి. సినిమా నేపథ్యంలో వచ్చే ప్రతీ పాట ఆకట్టుకునేదే!

బలాలు

+ శ్రీవిష్ణు, నివేదా పేతురాజు, రేణు

+ కథనం

+ పతాక సన్నివేశాలు

బలహీనతలు

– స్లోనరేషన్‌

చివరిగా: ‘మెంటల్‌ మదిలో..’ మరో కొత్త ప్రయత్నం

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే