దేవుడు చేసిన అన్యాయమిది: నారాయణ

0Narayana-son-nishit-dead-bodyనారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ నిషిత్ నారాయణ దుర్మరణం అతని తండ్రి, మంత్రి నారాయణను తీవ్రంగా కలచివేసింది. ప్రమాదానికి కొన్ని గంటల ముందు ఫోన్ ద్వారా మాట్లాడి జాగ్రత్తలు చెప్పిన ఆయన, ఆ తర్వాత కొద్దిసేపటికే కుమారుడి గురించి దుర్వార్త విని తట్టుకోలేకపోయారు.

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న నారాయణ.. విషయం తెలియగానే ఒక్కసారిగా కుప్పకూలినట్లు చెబుతున్నారు. కుమారుడి మరణ వార్తతో అర్థాంతరంగా ఆయన పర్యటన నుంచి వెనుదిరిగారు. కుమారుడి మృతదేహాన్ని చూడగానే బోరున విలపిస్తూ.. ఇటువంటి కష్టం ఎవరికి రావద్దన్నారు.

నారాయణ కుటుంబాన్ని పరామర్శించిన పలువురు మంత్రులు ఆయనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అందరితోను ఆయన ఒకే మాట చెప్పారు. ‘దేవుడు చేసిన అన్యాయమిది, మనమేం చేయలేం’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నారాయణ వియ్యంకుడైన మంత్రి గంటా శ్రీనివాస్ సైతం దిగాలుగా కనిపించారు.

మృతదేహాన్ని నెల్లూరు తరలించిన తర్వాత.. ఆఖరి క్రతువు కోసం నిషిత్ దేహానికి సాంప్రదాయ పద్దతిలో ఆఖరి స్నానం చేయించారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులంతా బోరున ఏడ్చారు. మధ్యాహ్నాం వరకు నిషిత్ అంత్యక్రియలు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.