జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి

0


jagan-announces-his-next-electionవైసిపి అధినేత వైయస్ జగన్‌కు నంద్యాలలో ఓటమి భయం పట్టుకుందని, అందుకే వరుసగా ఇక్కడే తిష్ట వేస్తున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు.

ఉప ఎన్నికకు కూడా జగన్ రెండు మూడు రోజులు కాకుండా జిల్లా నాయకుడిలా పర్యటిస్తున్నాడంటే జగన్‌కు కచ్చితంగా ఓటమి భయం పట్టుకున్నట్లేనని స్పష్టం చేశారు.

నంద్యాలలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డితో కలిసి మంత్రి కాల్వ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాల్చివేత వ్యాఖ్యలపై ఈసికి జగన్‌ ఇచ్చిన వివరణపై మాట్లాడుతూ.. తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఒత్తిడిలో అలా మాట్లాడారన్నారు. తన వ్యాఖ్యలకు జగన్ క్షమాపణలు చెబితే హుందాగా ఉంటుందన్నారు.

కాల్చివేత వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి జగన్ ఇచ్చిన వివరణలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించటం లేదని మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, ప్రత్తిపాటి పుల్లారావులు వేరుగా అన్నారు. జగన్‌ ఇచ్చిన వివరణపై ఎన్నికల సంఘం స్పందించాలని, ఎటువంటి పరివర్తన కనిపించన్నారు. జగన్ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు.

నంద్యాలలో జగన్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు ప్రశాంత్‌ కిషోర్‌ వంటి రాజకీయ సలహాదారులు కాదు,సైక్రియాటిస్టులు అవసరమని తెలుస్తోందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉంటూ సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు.

చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలను ఆవేదనతో చేశానని జగన్‌ చెప్పటం సిగ్గుచేటు అన్నారు. తప్పు చేశాననే బాధ ఆయనలో ఇసుమంతైనా కనబడటం లేదన్నారు. ఒక మనిషిలోని రాక్షసత్వానికి ఇది నిదర్శనమన్నారు. జగన్‌ అసలు ప్రతిపక్ష నాయకుడా? లేక రాజారెడ్డి నేరాలకు వారసుడా? అని ప్రశ్నించారు.

తమ దోపిడీకి అడ్డువచ్చిన వారిని హతమార్చటం కాల్చి చంపటం వైయస్ రాజారెడ్డి మార్క్‌ రాజకీయమని, తాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నంద్యాలలో తనలోని నేర స్వభావాన్ని బయటపెట్టుకున్నారని కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. జగన్‌ సన్నిహితులు, స్నేహితులు అంతా నేరస్తులేనని, ఈ ప్రాంత అభివృద్ధి, ప్రశాంత నంద్యాల కోసం ప్రజలు వైసిపిని చిత్తుగా ఓడించాలన్నారు.