ఫోన్‌లో మాట్లాడుతూ నేరుగా రైలుకెదురెళ్లింది

0miracle-mumbai-teen-run-overఈ సంఘటన నిజంగా ఓ మిరాకిల్‌. భూమ్మీద నూకలుంటే బతికేస్తారంతే అనే మాట కచ్చితంగా ఈ సంఘటనకు, ఇక్కడ పేర్కొంటున్న అమ్మాయికి సరిగ్గా సరిపోతుంది. ఓ గూడ్స్‌ రైలు కింద పడిన యువతి క్షేమంగా ప్రాణాలతో బయటపడి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. భందప్‌ ప్రాంత నివాసి అయిన ప్రతిక్ష నతేకర్‌ (19) అనే యువతి కుర్లాలోని తన స్నేహితురాలి ఇంటికెళ్లింది. ఉదయం 11గంటల ప్రాంతంలో తిరిగొస్తూ కుర్లా రైల్వే స్టేషన్‌లోని ఏడో నెంబర్‌ ప్లాట్‌ మీదకు చేరుకునేందుకు పట్టాలపైకి దిగి అవతలి ప్లాట్‌ఫాం నుంచి దిగి వస్తోంది.

ఆ సమయంలో ఆమె చెవిలో హెడ్‌ఫోన్స్‌ ఉన్నాయి. ఫోన్‌లో తన స్నేహితురాలితో మాట్లాడుతూ గూడ్సు రైలు వస్తుండటాన్ని గమనించలేదు. ఒక్కసారిగా ఆమె తల పైకెత్తగా ఎదురుగా రైలు రావడంతో భయంతో ప్లాట్‌పైకి పరుగెత్తే లోగానే నేరుగా రైలుకెదురెళ్లిన పరిస్థితి కనిపించింది. ఇది చూసిన పైలట్‌.. ఆ తర్వాత బ్రేకులు వేశాడు. గూడ్సు బండి కావడంతో పెద్ద శబ్దం చేస్తూ కాస్త నెమ్మదిగానే ఆమెను ఢీకొట్టింది. ఆమె మీద నుంచి రెండు మూడు బోగీలు కూడా పోయాయి.

దీంతో ప్లాట్‌ఫాంపై ఉన్న వాళ్లంతా కూడా ఆ యువతి చనిపోయిందని అనుకున్నారు. అయితే, తన ఎడమ కంటికి చిన్న గాయంతో తప్ప దాదాపు ఎలాంటి హానీ లేకుండానే ఆమె బయటపడింది. దీంతో అక్కడ ఉన్నవారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. కుర్లా రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డయిన ఈ సంఘటన గత నెల 13న చోటు చేసుకుంది.