ఫ్యామిలీని మిస్‌ అవుతున్నా: నారా లోకేశ్‌

0Nara-lokeshరాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తీరిక లేని పని వల్ల ఫ్యామిలీని బాగా మిస్‌ అవుతున్నానని నారా లోకేశ్‌ అన్నారు. ప్రభుత్వంలో చేరాక పార్టీకి సైతం దూరంగా ఉండాల్సి వస్తోందన్నారు.

బుధవారం అమరావతిలో మీడియాతో చిట్‌చాట్‌ చేసిన ఆయన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, తెలంగాణ మంత్రి కేటీఆర్‌, ఏపీలో నియోజకవర్గాల పెంపు తదితర అంశాలపై ఆసక్తికర కామెంట్లు చేశారు.

ముద్రగడతో పవన్‌కు పోలికేంటి?: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను పోల్చడం సరికాదని మంత్రి లోకేశ్‌ అన్నారు. ముద్రగడ సమస్యలు సృష్టించే వ్యక్తి అని, అదే పవన్‌ కల్యాణ్‌ సమస్యలపై పోరాడే యోధుడని వ్యాఖ్యానించారు.

హ్యూమన్‌టచ్‌ పోయిందా?: ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీలో హ్యూమన్‌ టచ్‌(మానవత్వపు విలువ) నశించిందంటే తాను నమ్మబోనని లోకేశ్‌ అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగా)లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదుచేసిందని, అయితే అక్రమాలు జరగలేదని మంత్రి వివరణ ఇచ్చారు.

కేటీఆర్‌తో నాకు పోటీలేదు: మంత్రులుగా పనిచేస్తున్న ముఖ్యమంత్రుల తనయులుగా కేటీఆర్‌, నారా లోకేశ్‌లను పోల్చుతూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెసిందే. అయితే లోకేశ్‌ మాత్రం కేటీఆర్‌ తనకు పోటీకానేకాబోరని తేల్చేశారు. ‘కేటీఆర్‌తో నాకు పోటీలేదు.. నేను పోటీ పడేది ఒక్క చంద్రబాబు నాయుడితోనే..’ అని స్పస్టం చేశారు.

మంత్రుల్ని వెయింట్‌ చేయిస్తున్నానా?: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీకి దూరం అయ్యానని లోకేశ్‌ అన్నారు. తనను కలవడానికి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలను గంటలపాటు వెయింట్‌ చేస్తున్నారనే ఆరోపణలపై స్పందించిన లోకేశ్‌.. అలాంటిదేమీ లేదని వివరించారు.

సీఎం బందీకారు: కొంతమంది అధికారుల చేతిలో ముఖ్యమంత్రి బందీ అయ్యారనే ఆరోపణలను లోకేశ్‌ ఖండించారు. సీఎం బందీ కాలేదని, అలాంటి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

నియోజకవర్గాలు పెరుగుతాయ్‌: ఏపీ, తెలంగాణల్లో నియోజకవర్గాల సంఖ్య పెంపు ఇప్పుడప్పుడే కుదరదన్న కేంద్రం ప్రకటనపై మంత్రి లోకేశ్‌ భిన్నంగా స్పందించారు. అతి త్వరలోనే నియోజకవర్గాలు పెరుగుతాయన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు.