కొడుక్కి కాదు.. తండ్రికి సవాలు విసరగలవా మోడీ?

0ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న వారు ఇలాంటి పనులు కూడా చేస్తారా? అన్నట్లుగా అప్పుడప్పుడు వ్యవహరిస్తుంటారు ప్రధాని మోడీ. రోటీన్కు భిన్నంగా వ్యవహరించే ఈ తీరులోనూ మోడీ తనకు మైలేజీ దక్కేలా చూసుకునే ప్లానింగ్ కనిపిస్తూ ఉంటుంది. తాను నిత్యం ఫిట్ నెస్ కోసం విపరీతంగా కష్టపడతానన్న మాట చెబితే గొప్పగా ఉండదు. కాసింత ఎబ్బెట్టుగా ఉంటుంది.

అదే.. తనకు రాజకీయంగా షాకిచ్చి ముఖ్యమంత్రి అయిన ఒక నేతకు.. తనతో ఫిట్ నెస్ పరీక్షలో పోటీకి వస్తారా? అంటూ సవాలు విసిరితే కొత్తగా ఉండటమే కాదు.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే సమయంలో తాను ఫిట్ నెస్ కోసం ఎంతగా శ్రమిస్తానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేలా తన మీడియా వర్గాన్ని రంగంలోకి దించటం ద్వారా మోడీ మొనగాడు భయ్ అన్న మాటను అనిపించుకునేలా చేయొచ్చు. తన పాలన మీద ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను.. తనలోకి కొన్ని అంశాల్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా దృష్టిని మళ్లించటం.. చర్చ దిశను మార్చటం లాంటి సిత్రమైన ప్లాన్లు వేస్తుంటారు మోడీ. తాజాగా కుమారస్వామికి ఫిట్ నెస్ ఛాలెంజ్ ఈ కోవకు చెందిందనే చెబుతారు.

గుండె ఆపరేషన్ చేయించుకున్న కుమారస్వామికి ఫిట్ నెస్ సవాలు విసిరే మోడీకి దమ్ముంటే.. కుమారస్వామి తండ్రి.. మాజీ ప్రధానిగా సుపరిచితులైన దేవగౌడకు విసురుతారా? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ.. తొందరపడి దేవగౌడకు కానీ సవాలు విసిరితే మోడీ భారీగా భంగపడిపోవటం ఖాయమంటున్నారు.ఎందుకంటే.. ఫిట్ నెస్ విషయంలో దేవగౌడ సీక్రెట్స్ తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందేనంటున్నారు.

తన ఫిట్ నెస్ కు సంబంధించి మోడీ పోస్ట్ చేసిన ఫోటోలు.. దేవెగౌడ వ్యాయామం ఫోటోల్ని చూస్తే తేలిపోవటమే కాదు.. మోడీ చేసే వ్యాయామం సింఫుల్ అన్నట్లుగా ఉంటుందని చెబుతున్నారు. 86 ఏళ్ల వయసున్న దేవెగౌడ నిత్యం చేసే కఠినమైన వ్యాయామం చూస్తే.. 40 ఏళ్ల వయస్కులు సైతం సిగ్గుతో కుంచించుకుపోతారంటున్నారు.తన వ్యాయామం కోసం ఒక ట్రైనర్ ను ప్రత్యేకంగా పెట్టుకోవటమే కాదు.. బెంగళూరులో భారీ జిమ్ కూడా ఏర్పాటు చేసుకున్న వైనం చాలా తక్కువ మందికి తెలుసంటున్నారు.

ఏడుసార్లు ఎమ్మెల్యేగా.. మరో ఏడుసార్లు ఎంపీగా గెలిచిన దేవెగౌడ 86 ఏళ్ల వయసులోనూ ఇంత చురుగ్గా ఉండటం వెనుక ఆయన నిత్యం చేసే కఠినమైన వ్యాయామంగా చెబుతారు. అంతెందుకు ఈ మధ్యన భారీగా నిర్వహించిన మహా మస్తకాభిషేకం సందర్భంగా బాహుబలిని దర్శించుకునేందుకు దేవెగౌడ 40 డిగ్రీల ఎండలో ఏకబిగువున 1300 మెట్లు ఎక్కటం అప్పట్లో చాలామందికి ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేనా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ జేడీఎస్ తరఫున ఆయన ఏకంగా 6వేల కిలోమీటర్లు తిరిగి వచ్చారు. 86 ఏళ్ల వయసులో ఇంత చురుగ్గా ఉండటం అంత సామాన్యమైన విషయం కాదన్న మాట అందరి నోటా వినిపించే తప్ప.. దాని వెనుకున్న సీక్రెట్స్ ఎవరూ బయటపెట్టలేదు. దేవెగౌడ సైతం తనను తాను గొప్పోడిగా మోడీ మాదిరి ప్రచారం చేసుకోలేదు.

కుమారస్వామికి మోడీ ఛాలెంజ్ విసిరిన నేపథ్యంలో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. దశాబ్దాలుగా వ్యాయామం చేయటమే తప్పించి తన ఫిట్ నెస్ కు ప్రత్యేకమైన రహస్యాలేమీ లేవంటూ సింఫుల్ గా తేల్చేశారు. తాను చాలా తక్కువగా తింటానని.. మద్యపానం..సిగిరెట్స్ తాగనని.. తేలికైన శాఖాహార భోజనం మాత్రమే తింటానని.. ఉదయాన్నే లేస్తానని ఆయన తన హెల్త్ సీక్రెట్స్ బయటపెట్టారు. మోడీ ఫిట్ నెస్ ఛాలెంజ్ ను దేవెగౌడ వద్ద ప్రస్తావించినప్పుడు ఆయన స్పందన ఏమిటో తెలుసా… జస్ట్ చిన్న చిరునవ్వు మాత్రమే. ఇది చదవగానే పాత సామెత గుర్తుకు వచ్చే ఉంటుంది.