పాక్ ప్రధాని కానున్న ఇమ్రాన్..మోదీకి విజయం?

0పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయితే భారత్ లో వచ్చే ఎన్నికల్లో మోదీ గెలుపు ఖాయమని ఎలా చెప్పగలం.. మోకాలికి – బోడిగుండుకు ముడేంటి అనుకోవద్దు. పాక్ తో సంబంధాలు భారత ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత సైన్యం పాక్ సేనలను తరిమికొడితే దేశం ఎంత గర్విస్తుందో… చివరకు ప్రతిపక్షాలు సైతం వైరం మరిచి ప్రభుత్వాన్ని ఎంతగా కీర్తిస్తాయో ఉరి – పఠాన్ కోట్ వంటి ఘటనల్లో చూశాం. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని కానుండడంతో భారత్ తో ఆ దేశ సంబంధాలు కచ్చితంగా దెబ్బతింటాయంటున్నారు విశ్లేషకులు. ఉగ్రవాద గ్రూపుల మెప్పు కోసం ఇమ్రాన్ భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతారన్న అంచనాలు వెలువడుతున్నాయి. అయితే.. భారత్ లోని మోదీ ప్రభుత్వం ఇదంతా చూస్తూ ఊరుకోదని.. తగిన బుద్ధి చెప్పడం ఖాయమని అంటున్నారు. అలా మోదీ ప్రభుత్వం పాక్ సైన్యాన్ని – ఉగ్రమూకలను చావగొట్టే అవకాశం ఇమ్రాన్ కల్పిస్తారని అంచనా వేస్తున్నారు. అది మోదీని మరింత హీరోని చేయడం ఖాయమని.. ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో మోదీకి – బీజీపీకి లాభిస్తుందని విశ్లేషిస్తున్నారు.

ఇమ్రాన్ ఖాన్ రాజకీయాల్లో కుదురుకోవడం మొదలైనప్పటి నుంచి ఉగ్రవాదులకు – సైన్యానికి అనుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టిన నేత. అటు తాలిబన్ – అల్ ఖైదాలతో.. ఇటు పాక్ సైన్యంతో మంచి సంబంధాలున్న ఆయన పాక్ కేంద్రంగా భారత్ లో కార్యకలాపాలు సాగించే ఉగ్రవాద బృందాలకూ ఆప్తుడే. అందుకే ఇమ్రాన్ ను పాకిస్థాన్ ప్రజలే తాలిబన్ ఖాన్ అని పిలుస్తారు. ఈ ఎన్నికల్లో ఉద్రిక్తతలు పెంచే భావోద్వేగాలను రగిల్చే కశ్మీర్ లాంటి అంశాల జోలికి ఆయన పోనప్పటికీ ప్రధాని పీఠంపై కూర్చున్నాక ఆ అంశాన్ని ప్రస్తావించకుండా ఉంటారన్న నమ్మకం లేదు. పైగా సైన్యం – ఉగ్రవాదుల మద్దతుంటే ప్రధాని పీఠాన్ని సుస్థిరం చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ఆయన వారికి అనుకూలంగా ఉంటూ వారి ఒత్తిళ్లకు లొంగే ప్రమాదముంది.

మరోవైపు…. ఇమ్రాన్కు నవాజ్ షరీఫ్ అంటే మంట. షరీఫ్ భారత్ పట్ల మిగతా పాక్ నేతల కంటే కొంత స్నేహంగానే ఉంటారన్న పేరుంది. పైగా నవాజ్ కు నరేంద్ర మోదీతో సాన్నిహిత్యం కూడా ఉండేది. నవాజ్ కుటుంబీకులకు భారత్ లో వ్యాపారాలూ ఉన్నాయి. పాక్ ఆర్మీ కన్నెర్ర చేయడానికి ఇది ప్రధాన కారణం. ప్రపంచదేశాల దృష్టిలో పాక్ ఓ విలన్ కావడానికి నవాజ్ షరీఫ్ కారణమని ఇమ్రాన్ తరచూ ఆరోపించేవారు. నవాజ్ అనుసరించిన ఏ మార్గాన్నీ ఇమ్రాన్ అనుసరించరన్నది సుస్పష్టం. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ తో ద్వైపాక్షిక శాంతి చర్చలను భారత్ 2013లోనే నిలిపేసింది. 2015లో నరేంద్ర మోదీ ఆకస్మికంగా పాక్లో దిగడాన్ని మినహాయిస్తే- రెండు దేశాల మధ్య సంబంధాలు సుహృద్భావంగా ఉన్నది లేదు. పాక్-ఆక్రమిత కశ్మీర్ లో సైన్యం మెరుపుదాడుల తరువాత సంబంధాలు మరింత దిగజారాయి. సరిహద్దుల్లో నిత్యం ఘర్షణలే.. కశ్మీర్ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఈ దశలో ఇమ్రాన్ ప్రధాని అవుతుండడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరగడం ఖాయమని అంచనాలు వెలువడుతున్నాయి.