కలాం మెమోరియల్‌ను ప్రారంభించిన మోదీ

0Modi-Inaugurates-Dr-Apj-Abdul-kalam-memorialతమిళనాడులోని రామేశ్వరంలో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్‌ కలాం స్మారక మండపాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. రామేశ్వరం సమీపంలోని పెయికరుంబు వద్ద తంగచ్చిమఠం ప్రాంతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సమాధి ఉంది. అక్కడే కేంద్ర ప్రభుత్వం రూ.15 కోట్ల వ్యయంతో స్మారక మండపాన్ని నిర్మించింది. గురువారం కలాం రెండో వర్ధంతి సందర్భంగా ఈ స్మారక మండపాన్ని మోదీ ప్రారంభించారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ మండపంలో ఏర్పాటుచేసిన సుమారు 700 కలాం ఫొటోలు, ఆయన సేవలపై గీసిన చిత్ర లేఖనాలను వీక్షించారు. ఆ తర్వాత కలాం సమాధి వద్ద మోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలాం కుటుంబసభ్యులతో మోదీ ముచ్చటించారు

ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు రాధాకృష్ణన్, నిర్మలా సీతారామన్, తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి పళనిస్వామి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మదురై ఎయిర్‌పోర్టులో మోదీకి గవర్నర్, ముఖ్యమంత్రి ఘనస్వాగతం పలికారు.

అబ్దుల్ కలాం స్మారక మండపాన్ని ప్రారంభించిన అనంతరం రామేశ్వరం-ఫయిజాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుకు మోదీ పచ్చజెండా ఊపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కొత్త రైలును ప్రారంభించారు. రామేశ్వరం నుంచి బయలుదేరే ఈ వీక్లీ ట్రైన్ అయోధ్య మీదుగా ఫయిజాబాద్ చేరుకుంటుంది. ప్రారంభం సందర్భంగా గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు రామేశ్వరం నుంచి బయలుదేరిన 06793 నంబరు గల ప్రత్యేక రైలు.. శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటలకి చెన్నై ఎగ్మోర్ చేరుకుంటుంది. శనివారం రాత్రి 11 గంటలకు ఫయిజాబాద్ చేరుతుంది. ఈ రైలు రెగ్యులర్ సర్వీసును 16793/16794 నంబర్లతో ఆగస్టు 6 నుంచి ప్రారంభిస్తున్నారు. ప్రతి ఆదివారం ఈ రైలు రామేశ్వరం నుంచి బయలుదేరుతుంది. అలాగే ప్రతి బుధవారం ఫయిజాబాద్ నుంచి తిరిగు పయనమవుతుంది.