శ్రీరెడ్డి గొడవ.. మోహన్ బాబు స్పందించాడు

0ఆ మధ్య శ్రీరెడ్డి గొడవ తెలుగు సినీ పరిశ్రమను ఎలా కుదిపేసిందో తెలిసిందే. కొన్ని రోజుల పాటు పరిశ్రమ ఆ గొడవతో అట్టుడికిపోయింది. టాలీవుడ్ గురించి జాతీయ స్థాయిలో చర్చ నడిచిందప్పుడు. అప్పటి పరిణామాలు ఇండస్ట్రీ జనాల్ని బాగా ఇబ్బంది పెట్టాయి. దీనిపై వేర్వేరు సందర్భాల్లో చాలామంది పెద్ద వాళ్లు స్పందించారు. ఐతే ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరైన మోహన్ బాబు మాత్రం ఇప్పటిదాకా దీనిపై నోరు మెదపలేదు. తన కూతురు మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషించిన ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. అప్పటి పరిణామాలతో తాను కుంగిపోయినట్లు వెల్లడించారు.

శ్రీరెడ్డి పేరెత్తకుండా ఆమె అర్ధనగ్న ప్రదర్శన చేయడం.. పవన్ కళ్యాణ్ ను బూతు తిట్టడంపై మోహన్ బాబు పరోక్షంగా ప్రస్తావించారు. తాను ఆ పరిణామాలు చోటు చేసుకున్న సమయంలో అమెరికాలో ఉన్నట్లు వెల్లడించారు. జరిగిందంతా చూసి తాను కుమిలిపోయానని.. కళామతల్లి పరిస్థితి ఇలా తయారైందేంటి అని మనో వేదనకు గురయ్యానని మోహన్ బాబు చెప్పారు. ఈ పరిణామాలతో ప్రతి రోజూ తాను తన గురువు దాసరి నారాయణరావును తలుచుకుంటూ ఉన్నానని.. ఆయన లేకపోవడం పెద్ద లోటని అన్నారు. కానీ ఇప్పుడు ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి తయారైందని చెప్పారు. పరిశ్రమ ఒక తల్లిలాంటిదని.. కొంచెం పెద్దా చిన్నా చూసుకుని ఎవరైనా ఏదైనా మాట్లాడాలని మోహన్ బాబు సూచించారు. తన కూతురు మంచు లక్ష్మి గురించి సోషల్ మీడియాలో వేసే సెటైర్ల గురించి తనకు తెలుసని.. దీనికి సంబంధించిన వీడియోలు అవీ తనకు చూపిస్తుంటారని మోహన్ బాబు చెప్పడం విశేషం.