హైదరాబాద్‌లోని మగాళ్లకే ఈ సమస్యలు ఎక్కువ!!

0joggingభాగ్యనగరంలోని మహిళ కంటే పురుషులే సుగర్, అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు నిమ్స్ నెఫ్రాలజీ విభాగం చేపట్టిన పరిశోధనలో తేలింది. వీటి కారణంగా మూత్రపిండ సంబంధ వ్యాధులు బారిన పడుతున్నట్లు కూడా గుర్తించింది. నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నగరంలోని 2,500 మంది పురుషులు, మహిళలపై మూడేళ్ల పాటు అధ్యయనం చేసి ఈ నిజాలను వెల్లడించింది.

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 150 వార్డుల్లో ఒక్కో వార్డు నుంచి 35 నుంచి 40 కుటుంబాలను అధ్యయనం కోసం ఎంపిక చేశారు. వీరిలో 1,250 మంది మహిళలు, 1,250 మంది పురుషులు ఉన్నారు. వీరిలో 400 మంది సుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తే వీరిలో 70 శాతం పురుషులే ఉన్నారు. అలాగే 550 అధిక రక్తపోటు కేసుల్లో 60 శాతం మంది మగవాళ్లే ఉన్నట్లు తేలింది.

వీటి కారణంగానే మహిళ కంటే పురుషులే క్రానిక్ కిడ్నీ వ్యాధులతో సతమతమవుతున్నారని నిమ్స్ నెఫ్రాలజీ విభాగం హెడ్, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ డి భూషణ్ రాజ్ వెల్లడించారు. హైదరాబాద్‌లో నగరం మొత్తంలో 16 శాతం మంది డయాబెటిస్‌, 22 శాతం మంది అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలింది.

వీరిలోని 8 శాతం మంది ఇప్పటికే మూత్రపిండ వ్యాధి బారిన పడినట్లు వెల్లడైంది. సుగర్ వ్యాధి కారణంగా కిడ్నీల్లోని చిన్న రక్త నాళాలు దెబ్బతింటాయని, దీంతో రక్తంలోని మలినాలు బయటకు పోవడం ఇబ్బందవుతుందని అన్నారు. క్రానిక్ కిడ్నీ రోగుల్లోని 2/ 3 వంతు మంది డయాబెటిక్, అధిక రక్తపోటు గురైనవారేనని తేలింది.

రక్తపోటు 140/ 90 ఎంఎం కంటే తక్కువ ఉండాలని, రక్తంలో సుగర్ శాతం (హెచ్‌బీ ఎ1సి) 6.5 శాతానికి మించకూడదని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్, ఎండోక్రైనాలజీ అండ్ అడిపోసిటీ డైరెక్టర్ డాకటర్ శ్యామ్ కలవాలపల్లి తెలిపారు. అయితే 550 అధిక రక్తపోటు కేసుల్లోని 40 శాతం మందికి తమకు ఈ సమస్య ఉన్నట్లు తెలియకపోవడం గమనార్హం.