స్టూడెంట్సా.. రబ్బరు బొమ్మలా?

0

నటవారసుల్ని పరిచయం చేయడంలో కరణ్ జోహార్ ట్రాక్ రికార్డ్ గురించి పదే పదే ప్రస్థావనకు వస్తూనే ఉంటుంది. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` చిత్రంతో ఆలియాభట్ – సిద్ధార్థ్ మల్హోత్రా- వరుణ్ ధావన్ లాంటి మెరికల్ని పరిచయం చేసిన ఘనత ఈయనదే. `ధడక్` చిత్రంతో జాన్వీ లాంటి తురుపుముక్కను పరిచయం చేశాడు. తాజాగా మరో ఇద్దరు భామల్ని `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్- 2` చిత్రంతో కరణ్ వెండితెరకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. నటుడు చుంకీ పాండే నటవారసురాలు అనన్య పాండే.. సినీపరిశ్రమకు పరిచయం ఉన్న హిమాన్సు- టీనా సుతారియా జంట నటవారసురాలిగా తారా సుతారియా బరిలో దిగుతున్నారు.

ఇప్పటికే `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్- 2` పోస్టర్లు టీజర్.. సాంగ్స్ కి అద్భుత స్పందన వస్తోంది. కరణ్ మార్క్ సినిమా ఇదని ప్రశంసలు దక్కాయి. ఇదివరకూ రిలీజ్ చేసిన కాలేజ్ సాంగ్ కి అభిమానుల్లో గొప్ప స్పందన వచ్చింది. కాలేజ్ స్టూడెంట్స్ ని స్వేచ్ఛగా విహరించే రొమాంటిక్ ప్రేమ గువ్వల్లా చూపిస్తున్నాడంటూ ట్రోలింగ్స్ తప్పలేదు. కాలేజ్ లో మరీ అంత విచ్చలవిడితనం ఉంటుందా? అంటూ ప్రశ్నించారు క్రిటిక్స్. అదంతా అటుంచితే తాజాగా మరో పాటను ఈ సీక్వెల్ సినిమా నుంచి లాంచ్ చేశారు. “విద్యార్థులంతా ఇక్కడ ఉన్నారు .. మీ గుండెల్ని దోచేసేందుకు“ అనే క్యాప్షన్ తో ఈ పాటను హైలైట్ చేయడం విశేషం.

`ముంబై దిల్లీ ది కుడియాన్..!“ అంటూ సాగే ఈ పాట ఆద్యంతం టైగర్ ష్రాఫ్ అథ్లెటిక్ డ్యాన్సింగ్ స్కిల్స్ ఎలివేట్ అయ్యాయి. బాడీని స్ప్రింగ్ లా తిప్పేస్తూ టైగర్ వేసిన స్టెప్పులు మైమరిపిస్తున్నాయి. ఇక యంగ్ బ్యూటీస్ తారా సుతారియా.. అనన్య పాండే చూడటానికి రబ్బరు బొమ్మల్లా కనిపిస్తున్నారు. టైగర్ బాడీ లాంగ్వేజ్ తో పోలిస్తే ఆ ఇద్దరిలో అంత స్వింగ్ కనిపించలేదు. డెబ్యూ నాయికల అనుభవ రాహిత్యం ఎక్స్ ప్రెషన్స్ లో తెలిసిపోతోంది. ఇక ఈ భామల అందచందాలకు స్టూడెంట్స్ ఫిదా అయిపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పాటలో ఉపయోగించిన కాస్ట్యూమ్ సెన్స్.. సెట్ ప్రాపర్టీలో విజువల్ బ్రిలియన్సీ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇది సంగీత్ పార్టీ నేపథ్యంలో వచ్చే సాంగ్ కాబట్టి ప్రతి ఫ్రేమ్ ని రంగుల హరివిల్లులా తీర్చిదిద్దడంలో కొరియోగ్రాఫర్స్ కృషి తెరపై కనిపిస్తోంది. ఇక పాటలో విదేశీ మోడల్స్ డామినేషన్ ఎక్కువైందా.. అనిపించక మానదు. విశాల్ శేఖర్ అందించిన ట్యూన్ రొటీన్ గానే ఉన్నా విజువల్ గా ఆకట్టుకుంది. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` చిత్రం మే 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ఈ సమ్మర్ సెలవుల్లో మరో రొమాంటిక్ కాలేజ్ లవ్ స్టోరి విద్యార్థులకు అందుబాటులోకి వస్తోందన్నమాట. ఈ సీక్వెల్ సినిమా పార్ట్ -1లానే హిట్టవుతుందా లేదా? నటవారసులు ఏ మేరకు సక్సెసవుతారు? అన్నది వేచి చూడాల్సిందే.
Please Read Disclaimer