అనుష్కపై మండిపడ్డ అర్హన్!

02014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాని తెలిసిందే. గ్రామాలు….చిన్న చిన్న పట్టణాలతో పాటు మహానగరాలలో కూడా చెత్తను నడిరోడ్డుపై పడేస్తున్న ఘటనలు ఇంకా చూస్తూనే ఉన్నాం. ఇదే తరహాలో నడిరోడ్డుపై ఓ ప్లాస్టిక్ సీసాను పడేసిన అర్హన్ అనే వ్యక్తిపై బాలీవుడ్ నటి అనుష్క శర్మ మండిపడిన విషయం విదితమే. ఆ వ్యక్తికి అనుష్క క్లాస్ పీకుతున్న ఘటనను అనుష్క భర్త – టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. ఆ ట్వీట్ కు నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ ట్వీట్ పై అర్హన్ స్పందించాడు. అనుష్క – కోహ్లీలను విమర్శిస్తూ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో అర్హన్ ఓ పోస్టు పెట్టాడు. అనుష్కకు మర్యాద తెలీదని తాను రోడ్డుపై పడేసిన చెత్త కంటే అనుష్క నోటి వెంట వచ్చిన చెత్తే ఎక్కువని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా కోహ్లీ బుర్ర కూడా చెత్తేనని ప్రచారం కోసమే తన వీడియోను పోస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కోహ్లీ లాగా తాను కూడా ప్రచారం కోసం ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయడం లేదని అర్హన్ చెప్పాడు. తాను పొరపాటున ఓ మిల్లీ మీటరు చెత్తను నిర్లక్ష్యంగా రోడ్డుపై పడేశానని తాను చేసిన తప్పుకు నేను పాశ్చాత్తాప పడుతున్నానని అర్హన్ అన్నాడు. కానీ తనతో అనుష్క కొంచెం మర్యాదగా ఉండాల్సిందని అందువల్ల ఆమె స్టార్ ఇమేజ్ తగ్గదని వ్యాఖ్యానించాడు. ఆ వీడియోను కోహ్లీ ఆన్ లైన్ లో పోస్ట్ చేయడం వల్ల ఈ అంశం మరింత తీవ్రమైన చెత్తగా మారిందని ఘాటుగా బదులిచ్చాడు. మరోవైపు అర్హన్ సోదరి కూడా అనుష్కపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన అన్నయ్యతో ఆమె మాట్లాడిన మాటలు చెత్త అని మండిపడింది. మరి అర్హన్ కామెంట్స్ పై అనుష్క విరాట్ ల స్పందన ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.