సినీ జర్నలిస్టులకు ఇల్లు

0

సినిమా జర్నలిస్టులకు సొంతింటి కల సాకారం కానుందా? అది కూడా హైదరాబాద్ లో నివసిస్తున్న సినిమా జర్నలిస్టులకు అమరావతిలో సొంత ఇల్లు కల నెరవబోతోందా? అందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహకాల్లో ఉందా? అంటే అవుననే అన్నారు నటుడు – ఎంపీ మురళిమోహన్. వినేందుకు కాస్తంత వింతగా అనిపించవచ్చు. కానీ అందుకు కృషి చేస్తానని రాజమండ్రి ఎంపీ మురళిమోహన్ అనడం పాత్రికేయ మిత్రుల్లో చర్చకొచ్చింది. సినిమాల్లోనే పుట్టిపెరిగాం. మేం ఆర్టిస్టులం. అందుకే సినిమా జర్నలిస్టుల్ని మా కుటుంబంలో ఒక భాగంగా భావిస్తాం. అలాంటిది మీకోసం ఈ ఒక్క పనీ చేసిపెట్టనా? అని అన్నారు.

ఈ విషయంపై ఏపీ ప్రభుత్వంతో – చంద్రబాబుతో ముచ్చటిస్తానని కూడా అన్నారు. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో సినీజర్నలిస్టు.. ఈటీవీ సత్యనారాయణకు అనారోగ్య కారణంగా సాయం ప్రకటించిన మురళిమోహన్ ఈ సందర్భంగా పై విషయాన్ని ప్రకటించారు. సత్యనారాయణకు అనూహ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అతడి వైద్యానికి భారీగా ఖర్చయింది. దాదాపు 25లక్షలు పైగానే కార్పొరెట్ ఆస్పత్రులకు ఖర్చు చేశారు. దీంతో సినిమా జర్నలిస్టులంతా కొంతమేర సాయం చేశారు. ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కేసీఆర్ 9లక్షల ఆర్థిక సాయం అందించారు. నేడు హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో సినీజర్నలిస్టుల సమక్షంలో మురళిమోహన్ ఏపీ ప్రభుత్వం తరపున 7లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించి – ఆ చెక్కును సత్యనారాయణకు అందించారు. ఇదే వేదికపై మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ .. `మా` అసోసియేషన్ తరపున మరో రూ.50లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని ప్రకటించారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం – తెలంగాణ ప్రభుత్వం – మా అసోసియేషన్ సాయం – సినీజర్నలిస్టుల సాయం కలుపుకుని రూ.16.50లక్షలు పైగానే సదరు సినీజర్నలిస్టుకు సాయంగా అందింది. ఈ సాయం ఆ కుటుంబానికి ఎంతో అవసరం. మరెందరికో సాయానికి ఇది ఆలంబనగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇకపోతే సినీజర్నలిస్టులకు సొంతింటి కల నెరవేరుస్తానన్న మురళీమోహన్ ఆ మాటను ఎంత మేరకు నిలబెట్టుకుంటారో వేచి చూడాల్సిందే. రాజకీయ నాయకుల మాటలన్నీ నీటిమూటలు కాకూడదని జర్నలిస్టులు కోరుకుంటున్నారు.
Please Read Disclaimer