బాబుకు షాకిచ్చిన మురళీధర రావు

0Chandrababu-naiduఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు షాకిచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు మింగుడుపడనివే.

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా ములకలచెరువులో బుధవారం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ బూత్ స్థాయి కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మురళీధర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పీలో రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోను తమ పార్టీ సొంతంగా పోటీ చేస్తుందని చెప్పారు.

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో కూడా పార్టీ బలోపేతానికి ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

రెండు రోజుల క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఎన్డీయే పార్టీల సమావేశంలో పాల్గొన్నారు. నవ్యాంధ్ర ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అలాగే, రాజకీయంగా జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపికి ఇబ్బందికరంగా మారారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసే నడుస్తామని చంద్రబాబు చెప్పారు.

ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత దేశం వైపు ప్రపంచం చూస్తోందని, అందుకు మోడీయే కారణమని తెలిపారు. మోడీ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్తామని చెప్పారు.

కానీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మురళీధర రావు మాత్రం తాజాగా, బుధవారం చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు షాకింగ్. అయితే, పార్టీలో ఉత్సాహం నింపే ఉద్దేశ్యంలో మాట్లాడారా లేక నిజంగానే పోటీ చేయడంపై బీజేపీలో అంతర్గతంగా చర్చ సాగుతోందా అనేది తెలియాలి.

ఇప్పటికే ఏపీలో సొంతంగా పోటీ చేసే అంశంపై బీజేపీలో పలుమార్లు చర్చ జరిగింది. అయితే ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పడంతో ఆ పార్టీ ఆ తర్వాత ఇరుకున పడింది. దీంతో కొన్నాళ్లు వారు మౌనం వహించారు. ఇప్పుడు ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తున్న నేపథ్యంలో మరోసారి ఒంటరి పోటీ అంశం తెరపైకి రావడం గమనార్హం.