మురుగదాస్ ఈసారేం చేస్తాడో..

0సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో మురుగదాస్ ఒకడు. అతడికి తిరుగులేని సక్సెస్ రేట్ ఉంది. మురుగదాస్ కెరీర్లో అంచనాల్ని అందుకోలేకపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి కానీ.. పూర్తిగా తేలిపోయి డిజాస్టర్లయిపోయినవి మాత్రం ఏడాది ముందు వరకు దాదాపుగా లేవనే చెప్పాలి. కానీ ‘స్పైడర్’ ఆ ఖాళీని పూడ్చేసింది. మురుగదాస్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. మురుగదాస్-మహేష్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు ఏదో ఊహించుకుంటే సినిమాలో ఇంకేదో కనిపించింది. నిజానికి ఈ చిత్రంపై జనాల్లో ముందే ఒక నెగెటివ్ ఇంప్రెషన్ పడిపోయింది. అందుకు దీని టీజర్.. ట్రైలర్లే కారణం. ఎప్పుడు తన సినిమాల టీజర్.. ట్రైలర్ విషయంలో మురుగదాస్ చాలా కేర్ తీసుకుంటాడు. అవి చాలా స్ట్రైకింగ్ గా ఉ:డేలా చూసుకుంటాడు. కానీ ‘స్పైడర్’ విషయంలో మాత్రం తేడా కొట్టేసింది.

‘స్పైడర్’ టీజర్.. ట్రైలర్లే అంచనాల్ని అందుకోలేకపోయాయి. ఏదో మిస్సయిన ఫీలింగ్ అవి కలిగించాయి. ఇప్పుడు మురుగదాస్ ‘సర్కార్’ సినిమాతో రెడీ అవుతున్నాడు. ‘తుపాకి’.. ‘కత్తి’ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత మురుగదాస్-విజయ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ‘స్పైడర్’ ప్రభావం ఎంతమాత్రం దీని మీద లేదు. తమిళంలో మామూలు అంచనాల్లేవు ఈ చిత్రంపై. ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 13న టీజర్ లాంచ్ చేయబోతున్నారు. మరి ‘స్పైడర్’ టీజర్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మురుగదాస్ ఈసారి ఏం మార్పు చూపిస్తాడు.. ‘సర్కార్’ టీజర్ ను ఎంత ఆసక్తికరంగా తీర్చి దిద్ది ఉంటాడు అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. విజయ్ తో మురుగ తీసిన ‘తుపాకి’.. ‘కత్తి’ సినిమాల టీజర్లయితే మామూలుగా పేలలేదు. ఆయా సినిమాలపై అమాంతం అంచనాలు పెరిగిపోయేలా చేశాయి. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీటవుతుందేమో చూడాలి.