దేవిశ్రీని వాళ్లు వదలట్లేదు

0రెండు దశాబ్దాలుగా టాలీవుడ్లో హవా సాగిస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్. చాలా త్వరగానే అతను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. టాలీవుడ్లో అందరు బడా స్టార్లతో అతను సినిమాలు చేశాడు. మామూలుగా ఒక సంగీత దర్శకుడు కొన్నేళ్లు పాటు పీక్స్ లో ఉన్నాక.. ఏదో ఒక దశలో డౌన్ అవడం సహజం. కానీ దేవిశ్రీ మాత్రం ఒకసారి పీక్స్ కు వెళ్లాక డౌనే కాలేదు. అప్పుడప్పుడూ ఔట్ పుట్ లో కొంచెం తేడా వచ్చినట్లు అనిపించినా తర్వాతి సినిమాలో తనేంటో రుజువు చేస్తాడు. అందుకే టాలీవుడ్లో ఏ పెద్ద ప్రాజెక్టు మొదలైనా.. ముందు దేవిశ్రీ వైపు చూస్తారు. ప్రస్తుతం తెలుగులోనే కాక తమిళంలోనూ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు దేవి. ఈ సమ్మర్లో ‘రంగస్థలం’.. ‘భరత్ అనే నేను’ లాంటి భారీ సినిమాలు వచ్చాయి దేవి నుంచి. ఈ సినిమాల ఆడియోలు సూపర్ హిట్ కావడంతో దేవి క్రేజ్ మరింత పెరిగింది.

ఇలాంటి టైంలో దేవి మీడియం రేంజి సినిమాలకు కూడా దొరికే పరిస్థితి లేదు. కానీ అతడితో ఒక లో బడ్జెట్ మూవీకి సంగీతం చేయించుకుంటోందట మైత్రీ మూవీ మేకర్స్. ఈ బేనర్లోనే దేవి ‘రంగస్థలం’ చేశాడు. దేవికి అత్యంత ఆప్తుడైన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఇదే బేనర్లో సుక్కు-దేవి కలిసి మహేష్ బాబు మూవీకి కూడా కలిసి పని చేస్తున్నారు. దీంతో దేవితో మైత్రీ వాళ్లకు సాన్నిహిత్యం కుదిరింది. సుకుమార్ సైతం మైత్రీని సొంత బేనర్ లాగా భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుక్కుతో మాట్లాడించి దేవిని తమ బేనర్లో రాబోయే సాయిధరమ్ తేజ్-కిషోర్ తిరుమల సినిమాకు ఒప్పించారట మైత్రీ అధినేతలు. కిషోర్ తో ఇంతకుముందు ‘నేను శైలజ’.. ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాలకు పని చేశాడు దేవి. అతడితోనూ సాన్నిహిత్యం ఉంది. దీంతో తన రేంజికి తగ్గ సినిమా కాకపోయినా.. బడ్జెట్ కు తగ్గట్లుగా కొంచెం పారితోషకం కూడా తగ్గించుకుని ఈ సినిమా చేస్తున్నాడట రాక్ స్టార్.