నాగబాబు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వేళ..

0



Nagababuనాగబాబు మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అన్నయ్య. అలాంటివాడికి ఇబ్బందులేముంటాయి అనుకుంటాం. కానీ ఆర్థిక ఇబ్బందులతో ఒక దశలో నాగబాబు ఆత్మహత్య చేసుకుందాం అని ఆలోచించే వరకు పరిస్థితి వెళ్లిందట. ఆ సమయంలో తనకు అన్నయ్య.. తమ్ముడు ఇద్దరూ అండగా నిలిచారని నాగబాబు తెలిపాడు. ఇదంతా ‘ఆరెంజ్’ సినిమా మిగిల్చిన చేదు అనుభవమే. ఈ సినిమాను భారీ బడ్జెట్లో నిర్మించాడు నాగబాబు. భారీ రేట్లకు అమ్మాడు. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో బయ్యర్లందరికీ డబ్బులు సెటిల్ చేయాల్సి వచ్చింది. ఆ దెబ్బకు తన ఆర్థిక పరిస్థితి మొత్తం తలకిందులైందంటూ ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు నాగబాబు.

‘‘నేను ఒకప్పుడు మంచి ఇంట్లో అద్దెకు ఉండేవాడిని. 90 వేల రెంట్ వర్త్ ఉండేది ఆ ఇల్లు. అలాంటి ఇంటి నుంచి 20 వేల అద్దె ఉన్న ఇంట్లోకి మారిపోయాను. ఉన్న కార్లన్నీ అమ్మేశాను. ఒక్క కారు మాత్రమే ఉంచుకున్నాను. అది కూడా తప్పనిసరి అని పెట్టుకున్నాను. బేసిక్ నీడ్స్ అన్నీ కట్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. రూపాయికి రూపాయి చూసుకుని ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. అప్పటికి నా ఆదాయం కూడా చాలా తక్కువగా ఉండేది. ఆ పరిస్థితుల్లో తర్వాతి నెలకు అన్నయ్యా నాకు కొంచెం డబ్బులివ్వు.. కళ్యాణ్ బాబూ నాక్కొంచెం డబ్బులివ్వు అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో నాకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. ఆ విషయంలో గట్టి నిర్ణయం ఏమీ తీసుకోలేదు కానీ.. నా ఆలోచనలు ఆ దిశగా సాగాయి. ఐతే ఆ సమయంలో అన్నయ్య.. కళ్యాణ్ బాబు కాస్త ముందు వెనుకగా ఫోన్ చేశారు. వాళ్లిద్దరూ ముందు నాకిచ్చిన భరోసా ఏంటంటే.. జరిగిన నష్టానికి అసలేం బాధపడకు. నేను భరిస్తాను అని అన్నయ్య.. నేను భరిస్తాను అని కళ్యాణ్ బాబు ఇద్దరూ చెప్పారు. వాళ్లిద్దరూ అలా ఫోన్ చేసి మాట్లాడిన విషయం వాళ్లకు గుర్తు లేదు. కానీ నాకు గుర్తుంది’’ అని నాగబాబు అన్నాడు.