వెంకీ మామ.. అనబోతున్న చైతూ?

0‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మళ్లీ టాలీవుడ్లో మల్టీస్టారర్ల ట్రెండు మళ్లీ ఊపందుకుంది. గత ఐదారేళ్లలో తెలుగులో చాలానే మల్టీస్టారర్లు వచ్చాయి. ఇప్పుడు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్లు తెరమీదికొస్తున్నాయి. అందులో దగ్గుబాటి వెంకటేష్-అక్కినేని నాగచైతన్యల కాంబినేషన్లో రాబోయే సినిమా ఒకటి. ‘జైలవకుశ’ తర్వాత బాబీ తీయబోయే సినిమా ఇదే అంటున్నారు. సురేష్ ప్రొడక్షన్లో తెరకెక్కబోయే ఈ చిత్రానికి ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ నడుస్తోంది. కాగా ఈ చిత్రానికి ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. దీనికి ‘వెంకీ మామ’ అనే టైటిల్ కన్సిడర్ చేస్తున్నట్లు సమాచారం.

నిజ జీవితంలో వెంకీ-చైతూ మామా అల్లుళ్లే అయిన నేపథ్యంలో సినిమాకు ఈ టైటిల్ పెడితే ఇన్ స్టంట్ గా జనాలకు ఎక్కేస్తుందని బాబీ భావిస్తున్నాడట. వెంకీ-చైతూలతో పాటు నిర్మాత సురేష్ కూడా ఈ టైటిల్ కు ఓకే చెప్పేసినట్లు సమాచారం. ఈ టైటిలే ఖరారయ్యేట్లయితే సినిమాలోనూ వెంకీ-చైతూ మామా అల్లుళ్లుగానే కనిపిస్తారనుకోవాలి. ప్రస్తుతం నాగచైతన్య‘సవ్యసాచి’ .. ‘శైలజారెడ్డి’ అల్లుడు సినిమాల్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇక ఏడాది కిందట్నుంచే ఖాళీగా ఉన్న వెంకీ.. త్వరలోనే వరుణ్ తేజ్ కాంబినేషన్లో ‘ఎఫ్-2’ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. ఆ సినిమా చేస్తూనే.. చైతూ ఖాళీ అయ్యాక అతడితో కలిసి బాబీ సినిమా చేయబోతున్నాడు.