నాగచైతన్య ‘మన్మధుడు 2’ ముచ్చట్లు

0నాగార్జున సూపర్ హిట్ చిత్రాల్లో ‘మన్మధుడు’ ముందు వరసలో నిలుస్తుంది. విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రచయితగా వ్యవహరించిన విషయం తెల్సిందే. నాగార్జున నటించిన చిత్రాల్లో మన్మధుడు చిత్రానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ విషయాన్ని గతంలో నాగార్జున చెప్పుకొచ్చారు. ఆ చిత్రంతో నాగార్జునకు మన్మధుడు అనే పేరు పడిపోయింది. అంతటి ప్రత్యేక గుర్తింపును – సక్సెస్ ను తెచ్చి పెట్టిన సినిమాలను ఏ హీరో కూడా అంత సులభంగా మర్చిపోడు. నాగార్జున కూడా ‘మన్మధుడు’ సినిమాపై ప్రత్యేక శ్రద్దతో ఆ చిత్రం సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.

ఆ ప్రచారంకు తోడుగా అన్నపూర్ణ స్టూడియో బ్యానర్పై ‘మన్మధుడు 2’ అనే టైటిల్ ను రిజిస్ట్రర్ చేయించడం జరిగింది అంటూ వార్తలు వచ్చాయి. దాంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో చైతూ లేదా అఖిల్ లతో నాగార్జున ‘మన్మధుడు 2’ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా నాగచైతన్య ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ‘మన్మధుడు’ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో సీక్వెల్ అంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పుకొచ్చాడు. అయితే ‘మన్మధుడు 2’ చిత్రం మాత్రం నిజమే అని పేర్కొన్నాడు.

‘చి.ల.సౌ’ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అవుతున్నారు. ఆ చిత్రం కాస్త అటు ఇటుగా మన్మధుడు చిత్రంను పోలి ఉంటుందట. దానికి తోడు రాహుల్ సిద్దం చేసుకున్న కథకు ‘మన్మధుడు’ టైటిల్ బాగా సూట్ అవుతుందని అందుకే మన్మధుడు 2 టైటిల్ ను రిజిస్ట్రర్ చేయించినట్లుగా నాగచైతన్య మాటల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ మన్మధుడు 2 చేయబోతున్నది ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.