చై సామ్ ల సోషల్ మీడియా కహాని

0బాక్స్ ఆఫీస్ వద్ద వేర్వేరు సినిమాలతో తలపడుతున్న లవ్లీ కపుల్ నాగ చైతన్య సమంతాల పోటీ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శైలజారెడ్డి అల్లుడుతో పాటు యుటర్న్ ఒకే రోజు విడుదల కానుండటం ఆసక్తి కరంగా మారింది. గెలుపు ఎవరితో మరో నలభై ఎనిమిది గంటల్లో తేలిపోతుంది కానీ ఆలోపు ఎవరికి వారు ప్రమోషన్స్ లో యమా బిజీగా ఉన్నారు. తన పేరు మీద మార్కెటింగ్ జరుగుతున్న యుటర్న్ కోసం సమంతా విస్తృతంగా మీడియా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇటీవలే దీని కోసం అనిరుద్ తో కలిసి ఓ వీడియో సాంగ్ చేస్తే అది కాస్తా సూపర్ హిట్ అయ్యి కూర్చుంది. ఈ సందర్భంగా జరిపిన మాటామంతిలో సమంతా సోషల్ మీడియా టాపిక్ ను తీసుకొచ్చింది. తాను మైంటైన్ చేసే ట్విట్టర్ ఇన్స్ టాగ్రామ్ తదితర అకౌంట్స్ లో ఏది పోస్ట్ పెట్టాలి పెట్టకూడదు అనే దాని గురించి చైతు ప్రమేయం కానీ సూచనలు కానీ ఏమి ఉండవని కాకపోతే అదే పనిగా పోస్ట్ చేయడాన్ని మాత్రం ఇష్టపడడని చెప్పేసింది.

చైతుకు సోషల్ మీడియా అంటే చిరాకట. అభిమానుల కోసం పెట్టుకోవడం తప్పించి ప్రత్యేకంగా అది ఉండి తీరాలి అనే ఆసక్తి ఏది లేదట. ఇటీవలే ఇన్స్ టాగ్రామ్ లోకి కూడా వచ్చిన చైతు ప్రొఫైల్ ని గమనిస్తే ఎక్కువగా కార్లు బైకులు దర్శనమిస్తాయని అతని అభిరుచి అదే అనే క్లారిటీ ఇచ్చేసింది. తన ఫోటోలు సినిమాల గురించి చైతు షేర్ చేసినా చేయకపోయినా దాని గురించి పెద్దగా పట్టింపు లేదని చెప్పిన సామ్ ఓసారి బికినీ లో పెట్టిన పోస్ట్ గురించి స్పష్టత ఇస్తూ పెళ్ళైన అమ్మాయి ఎలా ఉండాలి అనే నిబంధనలను బ్రేక్ చేయటం కోసమే అలా చేసానే తప్ప ఇంకే ఉద్దేశం లేదని కుండబద్దలు కొట్టేసింది. ఎదురెదురు పోటీ పడుతున్నారు అనే ప్రశ్నకు చాలా తెలివిగా తాము రెండు సినిమాలతో కలిసే వస్తున్నామని మీరే వేరే అర్థం తీస్తున్నారని కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి చైతు ప్లస్ సోషల్ మీడియా కబుర్లను బాగానే పంచుకున్న సమంతా యుటర్న్ సక్సెస్ మీద చాలా ధీమాగా ఉంది.