ఇది సరిపోదు అల్లుడూ!!

0నాగ చైతన్య సినిమా వచ్చి ఏడాది దాటేసింది. గత చిత్రం యుద్ధం శరణం విడుదలైంది ఆగస్ట్ 27న. అంతకు ముందు ఒకటి రెండు తప్ప మంచి ట్రాక్ రికార్డు మీదే ఉన్న చైతు తన తమ్ముడు అఖిల్ లాగా ఇంత గ్యాప్ తీసుకోవడం పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా లేరన్నది వాస్తవం. నాగార్జున సినిమాలను తగ్గించుకున్న నేపథ్యంలో అన్నదమ్ముల మీదే అభిమానుల ఆశలన్నీ ఉన్నాయి. కానీ పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఒకపక్క సవ్యసాచి గ్రాఫిక్స్ కారణంగా ఆలస్యమవుతూ ఉండగా మరోపక్క అన్ని సవ్యంగా ఉన్నాయన్న శైలజారెడ్డి అల్లుడుకు సైతం అడ్డంకులు తప్పలేదు. సరే ఏవో కేరళ వరదలు అన్నారు రీ రికార్డింగ్ లేట్ అన్నారు సర్దుకుందాం అని ప్రేక్షకులు విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ టీమ్ మాత్రం పది రోజుల్లో విడుదల పెట్టుకుని ఇంత స్తబ్దుగా ఉండటం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ట్రైలర్ కు మిలియన్ల వ్యూస్ అంటూ హంగామా చేస్తున్నారు కానీ ఈ మధ్య ప్రతి సినిమాకు ఇలాగే పబ్లిసిటీ చేయడం వల్ల ఇదేమి అంత ఘనతగా ఫీల్ కావడం లేదు జనం.

శైలజారెడ్డి అల్లుడుకి పోటీగా నిలుస్తోంది సమంతా యుటర్న్. ప్రమోషనల్ వీడియో పేరిట సమంతా చేసిన డాన్స్ ఇప్పటికే వైరల్ అయిపోయింది. థ్రిల్లర్ జానర్ అందులోనూ కన్నడలో ప్రూవ్ చేసుకున్న బ్లాక్ బస్టర్ హిట్. సో దర్శక నిర్మాతలు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. ఎటొచ్చి శైలజారెడ్డి అల్లుడుకే చిక్కొచ్చి పడుతోంది. ఆడియో రెస్పాన్స్ సైతం భీభత్సంగా లేదు. ఇంకేం కావాలే అంటూ గీత గోవిందంలో ఒక్క పాటతో ఊపేసిన గోపి సుందర్ అలాంటి ట్యూన్ ఒక్కటి కూడా ఇందులో ఇవ్వలేకపోయాడు. పైగా అవుడేటెడ్ అయిన అత్తా అల్లుళ్ళ ఫార్ములాలో దర్శకుడు మారుతీ ఇది ట్రై చేయటం పట్ల కూడా అనుమానాలు లేకపోలేదు. ఇన్నేసి భయాల మధ్య శైలజారెడ్డి అల్లుడు గెలవాలంటే మాస్ సినిమా అనే బ్రాండ్ ఒకటే సరిపోదు.మొదటి రోజే చూడాలి అనిపించేలా పబ్లిక్ లోకి సినిమాను తీసుకెళ్లాలి. బాహుబలి అంతటి మాస్టర్ పీస్ మొదలుకుని ఆరెక్స్ 100 లాంటి చిన్న వండర్ దాకా అన్ని కూడా ప్రమోషన్ విషయంలో శ్రద్ధ వహించినవే. మరి అల్లుడి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమిటో 13 ఉదయం తేలిపోతుంది.