‘సవ్యసాచి’ కి గోల్డెన్ ఛాన్స్

0

దసరా సినిమాల సందడి ముగిశాక టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోతోంది. గత వారం విడుదలైన ‘వీర భోగ వసంత రాయలు’కు ప్రేక్షకుల నుంచి కనీస స్పందన లేకపోయింది. యుఎస్ ప్రిమియర్ల నుంచి ముందే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో రిలీజ్ రోజు ఇక్కడ పరిస్థితి దారుణంగా తయారైంది. వీకెండ్లో కూడా ఈ సినిమా నిలబడలేకపోయింది. ముందు వారాల్లో వచ్చిన ‘అరవింద సమేత’.. ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రాలే గత వీకెండ్లోనూ ఓ మోస్తరుగా ప్రభావం చూపించాయి. వారాంతం తర్వాత బాక్సాఫీస్ వెలవెలబోతోంది. థియేటర్లు బోసిగా కనిపిస్తున్నాయి. దేనికీ బుకింగ్స్ లేవు. ఏదో నామమాత్రంగా సినిమాలు నడుస్తున్నాయిపుడు. ఇలాంటి సమయంలో ఒక మంచి సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే ‘సవ్యసాచి’ లాంటి క్రేజీ మూవీ థియేటర్లలోకి దిగుతోంది.

‘కార్తికేయ’.. ‘ప్రేమమ్’ లాంటి సూపర్ హిట్ల తర్వాత యువ దర్శకుడు చందూ మొండేటి రూపొందించిన చిత్రం ‘సవ్యసాచి’. ఈ సినిమా కాన్సెప్ట్ వెల్లడైనపుడే దీనిపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. దీనికి తోడు టీజర్.. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండి అంచనాల్ని పెంచాయి. ప్రమోషన్ కూడా కొంచెం గట్టిగా చేసి సినిమాను పెద్ద స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. డల్లుగా ఉన్న బాక్సాఫీస్ ఈ సినిమాతో మళ్లీ ఊపందుకుంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి ఆల్రెడీ అక్కడక్కడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. రెస్పాన్స్ బాగుంది. చైతూ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో.. అత్యధిక అంచనాలతో ఈ చిత్రం రిలీజవబోతోంది. ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని భావిస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చైతూ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.