మాస్ ముద్ర కోసం చైతు ఆరాటం!!

0ఈ గురువారం విడుదల కాబోతున్న శైలజారెడ్డి అల్లుడు మీద అక్కినేని ఫ్యాన్స్ తో పాటు చైతుకు చాలా ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఫీల్ గుడ్ అనిపించే సాఫ్ట్ స్టోరీస్ తోనే నెట్టుకుంటూ వచ్చిన చైతు ఆ మధ్య ఆటోనగర్ సూర్యతో బాగా మాస్ గా ట్రై చేసాడు కానీ అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కెరీర్ టాప్ గ్రాసర్స్ గా నిలిచిన ప్రేమమ్ రారండోయ్ వేడుక చూద్దాం లాంటివి ఫ్యామిలీ మూవీసే. అందుకే శైలజారెడ్డి అల్లుడు ద్వారా మాస్ ముద్ర కోసం ఆరాటపడుతున్నాడు. నాగార్జున సైతం కెరీర్ ప్రారంభంలో ఇలాంటి ఇబ్బందిని ఎదురుకున్నప్పుడు అల్లరి అల్లుడు-ఘరానా బుల్లోడు-వారసుడు-హలొ బ్రదర్ లాంటివి మాస్ కు బాగా దగ్గర చేశాయి. అప్పటి దాకా ఉన్న ఇమేజ్ కాస్త మారిపోయి నాగ్ ను ఆ జానర్ లో ఎన్నో సినిమాలు చేసేలా ప్రేరేపించాయి. ఇప్పుడు చైతు కూడా ఇంచుమించు అలాంటి ఫేజ్ లో ఉన్నాడు కాబట్టి శైలజారెడ్డి అల్లుడిని ఒక అవకాశంగా వాడుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి.

తాను చేసిన మాస్ యాక్షన్ సినిమాలతో అంతగా మెప్పించలేకపోయానని చైతు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఒప్పేసుకున్నాడు. అందుకే మారుతీ తీర్చిదిద్దిన ఈ ఎంటర్ టైనర్ తన మీద ఉన్న ఇమేజ్ ని మాస్ వైపు మళ్లిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసాడు. స్టార్ హీరోకు కావాల్సింది మాస్ అభిమానుల అండ. ప్రేమ కథలు ఎన్ని చేసినా మసాలా సినిమాలు ఇచ్చే కిక్కు ఇంకేవి ఇవ్వవు. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. తర్వాత వచ్చే సవ్యసాచి కూడా యాక్షన్ మూవీనే అయినప్పటికీ శైలజారెడ్డి అల్లుడు కనక చైతు కోరుకున్న సక్సెస్ ఇస్తే దానికి బాగా ప్లస్ అవుతుంది. ఇప్పటికే చైతు ఫ్యాన్స్ శైలజారెడ్డి అల్లుడు పోస్టర్లకు పాలాభిషేకాలు లాంటివి మొదలు పెట్టేసారు. అంటే వాళ్ళ అంచనాలు దీని మీద ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. పరిశ్రమకు వచ్చి 9 ఏళ్ళు దాటేసింది కాబట్టి చైతు ఇలా మాస్ ఇమేజ్ ని కోరుకోవడం సహజం. ఓపెనింగ్స్ లో వాళ్ళే కీలకం కాబట్టి.