నర్తనశాలకు ఖుషి కనెక్షన్

0కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి సరైన బ్రేక్ ఇచ్చే సినిమా కోసం ఎదురు చూసిన నాగశౌర్యకు ఈ ఏడాది ఛలో రూపంలో సాలిడ్ హిట్ దొరికింది. అమ్మానాన్నా స్వంత బ్యానర్ ఐరా పేరుతో తీసిన ఆ మూవీ 2018లో ఇప్పటిదాకా వచ్చిన బ్లాక్ బస్టర్స్ లో చోటు దక్కించుకుంది. అదే ఉత్సాహంతో చేస్తున్న @నర్తనశాల టీజర్ నిన్న విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. ఆ సందర్భంగా మాట్లాడిన నాగ శౌర్య ఏ తల్లితండ్రులు సినిమా చేయాలన్న కొడుకు కోసం 15 కోట్లు పెట్టుబడిగా పెట్టరని అలాంటి అమ్మానాన్న దక్కినందుకు తనకు చాలా గర్వంగా ఉందని ఎమోషనల్ అయ్యాడు. వాళ్లకు కొడుకుగా తాను ఏదైనా చేయాల్సింది బదులు తిరిగి వాళ్లే నా కోసం కష్టపడటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. కొత్త దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి ఎటువంటి బెరుకు లేకుండా తీసాడని తన శిష్యుడు ఎలా తీస్తున్నాడో తెలుసుకోవడం కోసం వంశీ పైడిపల్లి స్వయంగా సెట్స్ కు రావడం బాగా హెల్ప్ అయ్యిందని థాంక్స్ చెప్పాడు.

ఇక ఛలోతో మెలోడీ బ్రహ్మ మణిశర్మకు తగ్గ వారసుడు అనిపించుకున్న మహతి స్వర సాగర్ గురించి మాత్రం చాలా వినూత్నంగా చెప్పుకొచ్చాడు నాగ శౌర్య. తామిద్దరిది ఖుషిలో పవన్ కళ్యాణ్-భూమిక లాంటి బంధమని చిన్నప్పుడు ఎక్కడో ఒక చోట వేళ్ళు తగిలి మళ్ళి ఇలా కలిసి పనిచేయాలని రాసిపెట్టుందని తనకోసమే మహతి వచ్చి అద్భుతమైన పాటలు ఇస్తున్నాడని ప్రత్యేకంగా పొగడటం విశేషం. ఇందులో శివాజీరాజా చేసిన తండ్రి పాత్ర పది సంవత్సరాలు మాట్లాడుకునేలా ఉంటుందని అంతగొప్పగా పోషించారని చెప్పాడు.నాగ శౌర్య చాలా వెరైటీగా గే లక్షణాలున్న పాత్ర పోషించిన ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ నెల 30న విడుదల చేసే ప్లాన్ లో ఉంది యూనిట్. టీజర్ లో డేట్ ప్రకటించని నేపధ్యంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.