అమ్మమ్మ ఆలస్యంగా మేల్కొందే

0చేతిలో ఎంత డబ్బున్నా సినిమాను ఎంత వేగంగా పూర్తి చేసినా దాన్ని సరైన రీతిలో ప్రమోషన్ చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటో ఇప్పటి నిర్మాతలకు తెలియనిది కాదు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సినిమా నా పేరు సూర్య విడుదల ముందు ఏప్రిల్ అని ఫిక్స్ అయినప్పుడు టీజర్ జనవరిలోనే విడుదల చేసారు. దానికి కారణం ఒకటే. మన సినిమా పబ్లిక్ లో టాక్ గా ఉండాలి అంటే రెగ్యులర్ గా వాళ్ళతో మనం టచ్ లో ఉండాలి. కేవలం పబ్లిసిటీ లోపం వల్లే దెబ్బ తిన్న మంచి సినిమాలు గతంలో చాలానే ఉన్నాయి. అంతదాకా ఎందుకు మహానటి ఘన విజయం ఖరారైనా డ్రాప్ ఉండకుండా చూసుకునేందుకు వైజయంతి లాంటి పెద్ద బ్యానర్ మూడో వారంలో వినూత్నమైన ప్రమోషన్లకు శ్రీకారం చుట్టింది. సో ఇక్కడ ప్రమోషన్ ఎంత ముఖ్యమనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ సాఫ్ట్ టైటిల్ తో ఫ్యామిలీ సెక్షన్ ని టార్గెట్ చేసిన అమ్మమ్మగారిల్లు టీమ్ మాత్రం ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి విడుదల మరో రోజున్నరలో ఉందనగా ఒక ఈవెంట్ చేసి ట్రైలర్ విడుదల చేయటం చూస్తే ఆశ్చర్యం వేయక మానదు.

నిజానికి అమ్మమ్మగారిల్లు టీజర్ విడుదలైనప్పుడు శతమానం భవతి తరహాలో తాను పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవుతుందేమో అనుకున్నారందరు. కానీ ఆ తర్వాత ఏమైందో సడన్ గా సైలెంట్ అయ్యారు. ఈ సినిమా ఓపెనింగ్స్ కి కొంత దోహద పడే ఫాక్టర్ హీరో నాగ శౌర్య ఒక్కడే. అది కూడా తనను ఒక్కడినే చూసుకుని మొదటి రోజు హౌస్ ఫుల్ చేసే రేంజ్ కి శౌర్య ఇంకా చేరుకోలేదు. ఛలో సక్సెస్ అయినప్పటికీ కేవలం తన పేరు మీద ఓపెనింగ్స్ తెచ్చుకునేందుకు ఇంకా టైం పడుతుంది. హీరోయిన్ షాలిని చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న మూవీ కాబట్టి ప్రేక్షకులు తనను ఓయ్ హీరోయిన్ అనే విషయం కూడా మర్చిపోయారు. రావు రమేష్ తప్ప అంతగా చెప్పుకోదగ్గ ఆర్టిస్ట్ కూడా ఎవరు లేరు. దర్శకుడు సుందర్ సూర్య కు ఇదే మొదటి సినిమా కాబట్టి బ్రాండ్ ఇమేజ్ లేదు. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పుడు ఎంత మంచి సినిమా అయినా ప్రేక్షలుల మనసులో రిజిస్టర్ కావాలి అంటే ప్రమోట్ చేసుకోవడం చాలా ముఖ్యం. పైగా రవితేజ నేల టికెట్టుని పోటీగా పెట్టుకుని అమ్మమ్మ ఇంత ఆలస్యంగా నిద్ర లేస్తే ఎలా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.