నాగకన్య ట్రైలర్

0

నాగుపాము సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. 90లలో వచ్చిన `దేవి` సినిమాలోనే నాగుపామును చూశారు. ఆ తర్వాత యమున ప్రధాన పాత్ర పోషించిన ఓ చిత్రంలోనూ నాగుపామును చూశారు. కొన్ని తెలుగు సినిమాలకు ఒరిజినల్ నాగుపాము యాక్టివిటీస్ ని యథాతథంగా చిత్రీకరించి అటుపై కొంత గ్రాఫిక్స్ లో మిక్స్ చేసి మన దర్శకులు మెప్పించిన సందర్భాలున్నాయి. పాముకు – మనిషికి ఉన్న అవినాభావ సంబంధం – నాగ దేవత పూజలు – నాగుల చవితి పండగ వల్ల మన తెలుగు ప్రేక్షకులు నాగుపాము సినిమాలకు బాగా కనెక్టయ్యే అవకాశం ఉంది.

అయితే ఆ అవకాశాన్ని మన దర్శకులు సద్వినియోగం చేసుకుంటున్నారా? అంటే చాలా సార్లు తుస్సుమనిపించిన సన్నివేశమే కనిపిస్తోంది. ఇటీవలే కోడి రామకృష్ణ తీసిన `నాగభరణం` అలానే తుస్సు మంది. గ్రాఫిక్స్ ఫెయిల్యూర్ పరాజయానికి కారణమైంది. అయితే మరోసారి అలాంటి ప్రయత్నమే సాగుతోందా? అంటే అవుననే ఇదిగో తాజాగా రిలీజైన `నాగకన్య` ట్రైలర్ చెబుతోంది. ఇందులో ముగ్గురు అందమైన అమ్మాయిలు (లక్ష్మారాయ్ – కేథరిన్ – వరలక్ష్మి శరత్ కుమార్) నాగకన్యలుగా కనిపిస్తున్నారు. ఒక్కో కన్యకు ఒక్కో స్టోరి ఉంది. ఆ ముగ్గురు నాగుపాములుగా మారి మనుషుల్ని ఆడుకుంటున్న వైనం తెరపై చూపిస్తున్నారని అర్థమవుతోంది. ట్రైలర్ ఆద్యంతం అందచందాల నాగినుల కవ్వింత.. తుళ్లింత ఆకట్టుకుంటోంది. అయితే చిక్కొచ్చిందల్లా ఈ పాము విన్యాసాల్లో అసాధారణ విన్యాసాల్ని చూపించాలనే ప్రయత్నంలో మిస్ ఫైర్ అవుతున్న గ్రాఫిక్సుతోనే.

ఇలాంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడే గ్రాఫిక్స్ పెట్టుబడులపైనా గ్రాఫిక్స్ ఔట్ పుట్ తీసుకునే విధానంపైనా గ్రాఫిక్స్ అందించే కంపెనీ పైనా ఎంతైనా పరిజ్ఞానం అవసరం అన్నది మేకర్స్ పట్టించుకోలేదని తాజా ట్రైలర్ చెబుతోంది. కథ ఎంత బావున్నా తెలుగు నేటివిటీకి కనెక్టివిటీ ఉన్నా గ్రాఫిక్స్ ఫెయిలైతే జనం క్షమించని పరిస్థితి ఉందిప్పుడు. అనకొండ లాంటి సినిమాలో నిజం అనకొండ (దీంతో పోల్చడం తగదు) అదే అన్నంతగా గ్రాఫిక్స్ క్రియేట్ చేశారు. ఆ సినిమాని హాలీవుడ్ లో తీసినా మనవాళ్లు తెలుగు వెర్షన్ లో చూశారు కదా? అలాంటప్పుడు నాశిరకం పాముల్ని కళ్లు విప్పార్చి చూడగలరా? ఆధునిక యుగంలో బాహుబలి ఈగ అంటూ చాలానే ప్రయోగాలు చేశారు. ఇవన్నీ చూశాక గ్రాఫికల్ గా నాశిరకంగా పని చేస్తే కుదురుతుందంటారా? త్వరలో రిలీజ్ కి వస్తోంది కాబట్టి జనాలే పబ్లిగ్గా జవాబిస్తారేమో!! ఎల్.సురేష్ దర్శకత్వం వహంచిన `నాగకన్య` చిత్రాన్ని శ్రీధర్ అరుణాచలం నిర్మించారు. జై ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించాడు.
Please Read Disclaimer