సంచలనం: జగన్ పార్టీలోకి నాగార్జున?

0nagarjuna-and-jaganఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన ఓ సంచలన విషయం ప్రచారంలోకి వచ్చింది. ప్రముఖ తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున వైఎస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారంటూ మీడియాలో కథనాలు కూడా ప్రారంభమయ్యాయి. వ్యాపారదక్షతతో, సినీ నటనతో విశేష జనాదరణ పొందిన ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు.

ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం ఊపందకుందని అంటున్నారు. ఇప్పటికే ఆయన తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంంగా మెలుగుతున్నారు.

వ్యాపారవేత్తగా అక్కినేని నాగార్జునకు విశేషమైన ప్రాముఖ్యం ఉంది. సినిమాల్లో నటిస్తూనే ఆయన తనదైన శైలిలో కొన్ని వ్యాపారాలను నడిపిస్తున్నారు. నాగార్జునను ఆదర్శంగా తీసుకుని వ్యాపారాలు ప్రారంభించినవారు కూడా ఉన్నారు. అటువంటి నాగార్జున రాజకీయాలపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు.

వైయస్సార్ కుటుంబంతో నాగార్జునకు సన్నిహత సంబంధాలున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగార్జున పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ఉచితంగా ప్రచారం చేశారు కూడా. దాంతో నాగార్జున వ్యాపారాలకు ఆ రోజుల్లో వైయస్ అడ్డు పడలేదని అంటారు.

వైఎస్ జగన్ సన్నిహితుల్లో కొంతమందితో నాగార్జున వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నట్లు చెబుతారు. ఈ కారణంగానే ఆయన రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్లు చెబుతున్నారు. గుంటూరు లేదా విజయవాడ సీటు ఇవ్వడానికి జగన్ సిద్ధపడినట్లు కూడా ప్రచారం సాగుతోంది.

నాగార్జున మాత్రం తన రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడడం లేదు. భక్త రామదాసు వంటి పలు పాత్రలను సినిమాల్లో పోషించిన నాగార్జునకు ప్రజల్లో విశేషమైన గుర్తింపు ఉంది. ఆ పాత్రల కారణంగా ఆయనకు అభిమానులుగా మారినవారు చాలా మంది ఉన్నారు. ఇది రాజకీయాల్లో ఆయనకు కలిసి రావచ్చునని అంటున్నారు.