అందుకే వర్మతో మూవీ చేశానన్న నాగ్

0వర్మ.. వివాదాల కుప్ప. నాగ్.. వివాదాలకు కిలోమీటర్ల దూరంలో ఉండాలనుకునే వ్యక్తి. మరి.. ఇలాంటి భిన్నధ్రువాలు కలిసి సినిమా చేసే పరిస్థితి ఉంటుందా? అందులోకి.. వివాదాలే జీవితంగా మారిన దర్శకుడితో కలిసి వివాదాల్ని ఏ మాత్రం ఇష్టపడని ప్రముఖ నటుడు ఒక సినిమా చేయటానికి మించిన ఆసక్తికరమైన అంశం ఇంకేం ఉంటుంది. తాజాగా వర్మ దర్శకత్వంలో నాగ్ చేసిన ఆఫీసర్ చిత్రం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

వరుస ఫెయిల్యూర్స్ తో ఎప్పుడేం మాట్లాడతారో తెలీని వర్మతో నాగ్ సినిమా చేసేందుకు ఓకే చేశారన్న మాటే సంచలనమైంది. ఈసినిమా పూర్తి అవుతుందా? అన్న సందేహాన్ని వ్యక్తం చేసినోళ్లు లేకపోలేదు. అయితే.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా పూర్తి కావటమే కాదు.. రిలీజ్ కు ఒక్కరోజే మిగిలి ఉంది. తన తాజా మూవీ రిలీజ్ అవుతున్న వేళ.. నాగ్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వర్మతో సినిమా ఓకే చేయటానికి తానేం చేసింది చెప్పుకొచ్చారు.

ఆఫీసర్ కథను వినిపించటానికి వర్మ వచ్చినప్పుడు.. ఆయన చెప్పింది విన్నాక.. మూడు నెలల తర్వాత వచ్చి ఇంతే కసిగా చెప్పు.. అప్పుడు చేద్దామని అన్నానని.. అలానే మూడు నెలల తర్వాత వచ్చి అలానే చెప్పటంతో ఆఫీసర్ సినిమాకు ఓకే చెప్పినట్లు నాగ్ చెప్పారు. సినిమాకు తాను షరతు పెట్టలేదు కానీ ఒక అభ్యర్థన అయితే సీరియస్ గా చేసినట్లు వెల్లడించారు.

వర్మ తన దృష్టి మొత్తం సినిమా మీదనే పెట్టాలని చెప్పానని.. షూటింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తన ప్రమేయం ఎక్కువగా ఉండాలని కోరినట్లు చెప్పారు. “వర్మ చాలా మంచి టెక్నీషియన్. తన సినిమాలన్నీ చూడండి. నేపథ్య సంగీతం.. అందులో వినిపించే సంగీతం చాలా బాగుంటుంది. స్వతహాగా అతను మంచి ఎడిటర్. సినిమాని బాగా కట్ చేస్తాడు. ఇలాంటివన్నీ పూర్తిగా వాడాలని కోరా. అలానే చేశాడు” అని చెప్పారు. మరి.. వర్మకు నాగ్ ఇచ్చిన సర్టిఫికేట్ లో నిజం ఎంతన్నది మరో రోజులో తేలుతుందని చెప్పక తప్పదు.