అల్లుడికి సోగ్గాడి తుది మెరుగులు నిజమేనట!

0ఎంత పెద్ద దర్శకుడు అయినా – ఎంత సక్సెస్ ఫుల్ హీరో అయినా తాను చేసిన సినిమాల విషయంలో కొన్ని సార్లు కొన్ని కొన్ని పొరపాట్లు దొర్లడం సహజం. వారు చేసిన తప్పులు వారికి కనిపించవు – కనుక సెకండ్ ఒపీనియన్ తీసుకునేందుకు ఏమాత్రం వెనుకాడరు. తెలుగులో ఎన్నో చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయిన సమయంలో రీ షూట్ను జరుపుకున్న సందర్బాలున్నాయి. సినిమా రషెస్ చూసి వాటికి మంచి కరెక్షన్ చెప్పే వారిలో అల్లు అరవింద్ – దిల్ రాజు – నాగార్జునలు ముందు ఉంటారు అంటూ టాలీవుడ్ లో టాక్ ఉంది. వీరు ఏదైనా మార్పు చేర్పు చెప్పారు అంటే ఎంతటి దర్శకుడు అయినా వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిందే.

తాజాగా ‘శైలజ రెడ్డి అల్లుడు’ విషయంలో నాగార్జున వేలు పడ్డట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సినిమా ఎడిటెడ్ వర్షన్ చూసిన నాగార్జున చిన్న చిన్న ప్యాచ్ వర్క్ ను సూచించడం జరిగిందట. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పాటు – ఆ సీన్స్ లో ఉండాల్సిన వెన్నెల కిషోర్ విదేశాల్లో ఉండటంతో లైట్ తీసుకోవాలని భావించారు. కాని కేరళ వరదల కారణంగా రీ రికార్డింగ్ ఆలస్యం అయ్యింది. దాంతో సినిమా విడుదల రెండు వారాలు ఆలస్యం అయ్యింది. ఎలాగూ సమయం దొరికింది కదా అని విదేశాల నుండి తిరిగి వచ్చిన వెన్నెల కిషోర్ తో ఆ సీన్స్ ను చిత్రీకరించినట్లుగా సమాచారం అందుతుంది.

చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం మూడు రోజుల్లో ప్యాచ్ వర్క్ ను పూర్తి చేసి నాగ్ చెప్పినట్లుగా ఎడిటింగ్ లో చిన్న చిన్న మార్పులు చేసి సినిమాను సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. నాగచైతన్యకు ఈ చిత్రం చాలా కీలకం. అందుకే నాగార్జున ఒపీనియన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మారుతి గత చిత్రాల ఫలితాల దృష్ట్యా ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంటుందని అక్కినేని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రంలో అను ఎమాన్యూల్ హీరోయిన్ గా నటించగా రమ్యకృష్ణ కీలకమైన అత్త పాత్రను పోషించింది.