దేవదాసు తర్వాత ఏది బాసూ

0క్రేజీ మల్టీ స్టారర్ దేవదాస్ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. నాగార్జున నానిలు మొదటి సారి జంట కట్టిన ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. విడుదలకు అటుఇటుగా ఇరవై రోజులే ఉన్న నేపథ్యంలో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీని తర్వాత నాని జెర్సీతో బిజీ అయిపోతాడు కానీ నాగ్ ఇంకా ఏ కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. గతంలో సోగ్గాడే చిన్ని నాయనకు ప్రీక్వెల్ గా బంగార్రాజు తీసే ఆలోచన ఉందని చెప్పిన కింగ్ నాగార్జున దాని ప్రస్తావన మళ్ళి ఈ మధ్య తేవడం లేదు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందన్నాడు కానీ ఖచ్చితంగా ఏ టైంలో మొదలుకావొచ్చు అని మాత్రం చెప్పలేకపోయాడు. నేల టికెట్టు ఓ మాదిరిగా హిట్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ దాని ఫలితం పుణ్యమా అని కళ్యాణ్ కృష్ణ టేకింగ్ మీద కొత్త అనుమానాలు మొదలయ్యాయి. సో ప్రకటించే దాకా బంగార్రాజు హోల్డ్ లో ఉన్నట్టే.

దేవదాస్ కాకుండా నాగార్జున షూటింగ్ లో ఉన్నది బాలీవుడ్ మల్టీ స్టారర్ బ్రహ్మస్త్ర మాత్రమే. కానీ అది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. తెలుగు వెర్షన్ డబ్బింగ్ చేయటం కూడా అనుమానమే. గతంలో నాగ్ స్పెషల్ రోల్స్ చేసిన కొన్ని సినిమాలు తెలుగులో కనీసం డబ్ కూడా చేయలేదు. ఫీల్ ఉండదనే కారణంతో డ్రాప్ అయినవి కూడా ఉన్నాయి. సో అభిమానుల పరంగా చూసుకున్నా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తేనే లెక్కలోకి వస్తుంది. దేవదాస్ తర్వాత నెలకొన్న ఈ సందిగ్ధం తొలగాలి అంటే నాగార్జున మనసులో మాట తెలియాలి. రాజు గారి గది 3 చేస్తానన్న ఓంకార్ టీవీ షోలకు వెళ్ళిపోయాడు. స్టార్ డైరెక్టర్లందరు తమ తమ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు. మరి నాగ్ తో చేయబోయే దర్శకుడు ఎవరో ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పాలి.