తనుశ్రీకి నోటీసులు..మరోవైపు కేసు నమోదు!

0

ఇటీవల కాలంలో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. బాలీవుడ్ ప్రముఖులు నానా పటేకర్.. వివేక్ అగ్నిహోత్రి తదితర ప్రముఖులపై వేధింపుల ఆరోపణలతో వార్తల్లోకి వచ్చిన ఆమెపై తాజాగా కేసు నమోదు చేశారు.

తనను లైంగికంగా వేధించారన్న తనుశ్రీ దత్తా ఆరోపణలు సంచలనం సృష్టించటం తెలిసిందే. తనపై తీవ్ర ఆరోపణలు చేసిన తనుశ్రీపై నానా పటేకర్ స్పందించారు. ఆయన తరఫు లాయరు నోటీసులు పంపారు. మరోవైపు తనుశ్రీపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కార్యకర్త సుమంత్ దాస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.

ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేశారు. తమ సంస్థపై తనుశ్రీ అసత్య ఆరోపణలు చేసినట్లుగా పేర్కొన్నారు. తన ఆరోపణలతో తమ నేత రాజ్ థాకరేతో పాటు నవనిర్మాణ సేన పరువునకు భంగం కలిగించారని ఆరోపించారు. నానా పటేకర్ పై ఆరోపణలు చేసిన నేపథ్యంలో తనకు నవనిర్మాణ సేన హెచ్చరికలు చేసిందంటూ తనుశ్రీ ఆరోపించిన వైనం తెలిసిందే.

ఈ వివాదం ఒక పక్క సాగుతుండగానే.. బిగ్ బాస్ రియాలిటీ షో 12వ సీజన్ లో తనుశ్రీకి అవకాశం లభిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఒకవేళ.. తనుశ్రీకి బిగ్ బాస్ షోలో అవకాశం లభిస్తే.. తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని నవనిర్మాణ సేన హెచ్చరిస్తోంది.

బిగ్ బాస్ లో ఆమెకు అవకాశం ఇస్తే.. ఆ తర్వాత ఏదైనా జరిగే తమకు సంబంధం లేదంటూ బిగ్ బాస్ కు తమదైన శైలిలో వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. ఓపక్క నోటీసులు.. మరోవైపు కేసు నమోదుతో పాటు.. బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు అవకాశం ఇస్తే ఇక అంతే సంగతులన్న హెచ్చరికలతో తనుశ్రీపై అంతకంతకూ ఒత్తిడి పెరుగుతోందన్న మాట వినిపిస్తోంది.
Please Read Disclaimer