నేచురల్ స్టార్ దశాబ్ధం కెరీర్!

0ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హీరో అవ్వడం అన్నది ఊహించనిది. హీరో అయ్యాక ఏకంగా ఇండస్ట్రీ బెస్ట్ పెర్ఫామర్ అన్న పేరు తెచ్చుకుని – ఈగోయిస్టిక్ వరల్డ్ లో అందరికీ కావాల్సిన వాడిగా మారడం అన్నది ఇంకా పెద్ద సవాల్. కానీ ఆ రెండు ఫీట్లు వేసి సమర్ధుడు అన్న పేరు తెచ్చుకున్నాడు నాని. ఇంతింతై.. స్టార్ గా ఎదిగి నేచురల్ స్టార్ అన్న బిరుదును అందుకున్నాడు. మాస్ మహారాజా రవితేజ తర్వాత స్వయంకృషితో ఎదిగిన హీరోగా నాని పేరు చెబుతారు. కెరీర్ ఆరంభం బాపు – శ్రీనువైట్ల వంటి సీనియర్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత ఓ ఎడిట్ సూట్ లో తనని చూసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ అప్పటికే రెడీ చేసుకున్న అష్టాచెమ్మా స్క్రిప్టుకి సరిపోతాడని భావించి హీరోగా ఎంచుకున్నారు. తొలి సినిమానే బంపర్ హిట్. ఆ తర్వాత కథేంటో తోలిసిందే.

రైడ్ – భీమిలి కబడ్డీ జట్టు .. లాంటి నేచురల్ కథల్ని ఎంచుకుని అందరినీ మెప్పించాడు. పిల్ల జమీందార్ – ఈగ చిత్రాలతో బ్లాక్ బస్టర్లు కొట్టాడు. `అలా మొదలైంది` చిత్రంతో ఎదురేలేని హీరో అయ్యాడు. ఆ క్రమంలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధారణంగా పెరిగింది. సరిగ్గా అప్పుడే తన జీవితంలోకి రాహువు ప్రవేశించాడు. వరుసగా అరడజను ఫ్లాప్లు. ఇక కెరీర్ అయిపోయిందనే అనుకున్నారంతా. ఎటో వెళ్లిపోయింది మనసు – ఆహా కళ్యాణం – పైసా – జెండా పై కపిరాజు.. ఇలా వరుస ఫ్లాప్ లతో సతమతమయ్యాడు. ఆ క్రమంలోనే కెరీర్ పరంగా బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన టైమ్ లో `ఎవడే సుబ్రమణ్యం` చిత్రం ఆదుకుంది. అటుపై మారుతి `భలేభలే మగాడివోయ్`తో బంపర్ హిట్ ఇచ్చాడు. ఇక అటుపై అతడి జైత్రయాత్రకు ఎదురేలేదు. కృష్ణగాడి వీర ప్రేమగాధ – జెంటిల్ మేన్ – మజ్ను – నేనులోకల్ – నిన్నుకోరి – ఎంసిఏ అన్నీ హిట్లే. వరుసగా ఎనిమిది విజయాలతో ఇండస్ట్రీని షేక్ చేశాడు.

నాని డబుల్ హ్యాట్రిక్ హీరోగా వెలిగిపోయాడు. ఇటీవలే రిలీజైన `కృష్ణార్జున యుద్ధం` ఫ్లాప్. ఎనిమిది వరుస విజయాల తర్వాత ఒక్క ఫ్లాప్. కెరీర్ తొలి సినిమా `అష్టాచెమ్మా` సెప్టెంబర్ 5 – 2008న రిలీజైంది. నేటితో దశాబ్ధం కెరీర్ దిగ్విజయంగా పూర్తయింది. గాడ్ ఫాదర్ లేకుండానే ఈ స్థాయిని అందుకున్న నానీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇప్పుడు అతడే ఇండస్ట్రీ బంతిని ఆడే క్యూలా మారాడు! బుల్లితెరపై `బిగ్ బాస్` హోస్ట్ గానూ సక్సెసై అందరి మన్ననలు అందుకుంటున్నాడు.