నాని రేంజికి ఇది సూపరబ్బా..

0తెలుగు ‘బిగ్ బాస్’ తొలి సీజన్ మొదలయ్యేటపుడు అది ఏమాత్రం విజయవంతమవుతుందో అని చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆ షో సూపర్ హిట్టయింది. ఆ షో వల్లే స్టార్ మా ఛానెల్ టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగింది. షో జరిగినన్నాళ్లూ ఛానెల్ టాప్ లో సాగింది. ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన తొలి ఎపిసోడ్ 16.18 టీఆర్పీ రేటింగ్ సంపాదించింది. ఒక రియాల్టీ షోకు ఆ స్థాయిలో రేటింగ్ రావడం మామూలు విషయం కాదు. ఆ తర్వాత కూడా ‘బిగ్ బాస్’కు నిలకడగా మంచి రేటింగ్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ప్లేస్ లోకి నాని వచ్చిన బిగ్ బాస్ రెండో సీజన్ కు ఎలాంటి రేటింగ్స్ వస్తాయా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులు ఫలించాయి. బిగ్ బాస్-2 టీఆర్పీ రేటింగ్ వివరాలు బయటికి వచ్చాయి.

నాని హోస్టుగా వ్యవహరించిన తొలి ఎపిసోడ్ కు 15 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఎన్టీఆర్ షోతో పోలిస్తే ఇది తక్కువే. అలాగని దీన్ని తక్కువగా చూడటానికి లేదు. ఎన్టీఆర్ ఒక సూపర్ స్టార్. అతడి చరిష్మానే వేరు. పైగా ‘బిగ్ బాస్’ అప్పటికి అందరికీ కొత్త. ఎన్టీఆర్ తో పోలిస్తే నాని రేంజ్ తక్కువ. పైగా ఆల్రెడీ ఒక సీజన్ చూసేసిన జనాల్లో ఈసారి షో పట్ల ఆసక్తి తగ్గింది. పార్టిసిపెంట్లు కూడా అంత ఆసక్తి రేకెత్తించలేదు. ఇలా చాలా నెగెటివిటీని తట్టుకుని కూడా 15 టీఆర్పీ రేటింగ్ సాధించడం అంటే చిన్న విషయం కాదు. నాని రేంజికి ఈ రేటింగ్ సూపర్ అనే చెప్పాలి. ఐతే నాని లేనపుడు షోకు ఎలాంటి రేటింగ్స్ వచ్చాయో.. మున్ముందు రేటింగ్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి. గత సీజన్ తో పోలిస్తే ఈసారి ‘బిగ్ బాస్’ పట్ల చాలా వ్యతిరేకత కనిపిస్తున్న మాట వాస్తవం. నాని బాగానే చేస్తున్నప్పటికీ పార్టిసిపెంట్ల వల్ల షో చెడిపోతోందని.. వాళ్లు షోను నిలబెట్టలేకపోతున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.