నాని నిర్మాతగా మారనున్నారు

0ఇన్నాళ్లు నటుడిగా ప్రేక్షకుల్ని అలరించిన నేచురల్‌ స్టార్‌ నాని ఇప్పుడు నిర్మాతగా మారారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ కీలక ప్రకటన చేశారు. ‘వాల్‌ పోస్టర్‌ సినిమా’ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి, సినిమా నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. కథ బాగా నచ్చడంతోనే తానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

‘ఈ ఏడాది ప్రారంభంలో ప్రశాంత్‌ అనే ఒక అబ్బాయి వచ్చి నాకు కథ విన్పించాడు. ఆ కథలో చిన్న పాత్రకు నా వాయిస్‌ ఓవర్‌ అడిగాడు. కథ చాలా కొత్తగా, విభిన్నంగా అనిపించింది. ఇంతకు ముందు తెలుగు ప్రజలు ఇలాంటి కథను స్క్రీన్‌ మీద చూడలేదు అనిపించింది. ఇలాంటి ఆలోచనకు ఓ మంచి బృందం, సపోర్ట్‌ చాలా అవసరమని అన్పించింది. ‘ఎవరు నిర్మిస్తున్నారు?’ అని అడిగా. ఇంకా తెలియదు, ఏదో విధంగా మ్యానేజ్‌ చేస్తా అన్నాడు. అలా మ్యానేజ్‌ చేసి తీసే సినిమా కాదు ఇది, బాగా తీయాలి’.

‘నేనే ఎందుకు నిర్మించకూడదు అనుకున్నా. ఈ సినిమాను నిర్మిస్తానని ప్రశాంత్‌కు చెప్పాను. ఆ తర్వాత చాలా మంది టెక్నీషియన్స్‌కి కథ నచ్చి మాతో కలిసి పనిచేశారు. దాదాపు 80 శాతం సినిమా పూర్తైంది. వచ్చే ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సమయం దగ్గర పడుతోంది కాబట్టి ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ ప్రకటించాలి అనుకున్నాం. అందుకే ఈ వీడియో.. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వాల్‌ పోస్టర్‌ సినిమా ప్రొడక్షన్‌ నం.1 ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ ప్రకటన చేస్తాం. చాలా ఉత్సుకతగా ఉంది’ అంటూ నాని ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

నాని ప్రస్తుతం ‘ఎం.సి.ఎ’ (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌) చిత్రంలో నటిస్తున్నారు. సాయిపల్లవి కథానాయిక. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ విడుదలైంది. ఈ చిత్రం తర్వాత నాని ‘కృష్ణార్జున యుద్ధం’లో నటించనున్నారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.