‘బిగ్ బాస్’ హోస్ట్ గా ఉండను..హౌస్ లో ఉండలేను

0

నేచురల్ స్టార్ నాని ‘బిగ్ బాస్’ దెబ్బకు బాగానే ఇబ్బంది పడ్డట్లున్నాడు. ఈ షో మొదలు కావడానికి ముందు వరకు అతను అందరివాడిలా ఉండేవాడు. అతడిపై ఏ వ్యతిరేకతా ఉండేది కాదు. కానీ ‘బిగ్ బాస్’ హోస్ట్ కావడంతో నాని ఎన్నడూ లేని విధంగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ఎన్టీఆర్ ను రీప్లేస్ చేస్తూ హోస్ట్ కావడంతో నందమూరి ఫ్యాన్స్ ఒక వైపు.. కౌశల్ ను టార్గెట్ చేశాడంటూ అతడి అభిమానులు మరోవైపు నానిపై పడ్డారు. దీనికి తోడు విరామం లేకుండా పని చేయడం వల్ల కూడా నాని కొంత ఫ్రస్టేట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే తాను మళ్లీ ‘బిగ్ బాస్’ హోస్ట్ గా ఉండే అవకాశం లేదని ఇంతకముందే సంకేతాలిచ్చాడు నాని.

తాజాగా ఒక ఇంటర్వ్యూలోనూ అతను ఈ విషయమై స్పష్టత ఇచ్చాడు. ‘బిగ్ బాస్’ మూడో సీజన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారా అని అడిగితే.. తాను మళ్లీ ఈ షోలో హోస్ట్ గా చేయనని ట్విట్టర్లో ముందే ప్రకటించానని.. ఆ నిర్ణయంలో మార్పేమీ లేదని నాని స్పష్టం చేశాడు.ఇంతకీ ‘బిగ్ బాస్’ హోస్ట్ గా చేశారు.. ఒక పార్టిసిపెంట్ గా హౌస్ లో ఉండమంటే ఏమంటారు అని నానిని అడిగితే.. ఛాన్సే లేదనేశాడు. ఒక రోజు షోలో భాగంగా మూడు గంటలు తాను హౌస్ లోపల ఉన్నానని.. కానీ ఆ మూడు గంటలే చాలా ఎక్కువ సమయంలా అనిపించిందని.. అలాంటిది రోజుల తరబడి లోపల ఉండాలంటే తన వల్ల కాదని నాని స్పష్టం చేశాడు. ‘బిగ్ బాస్’ అయిపోవడంతో పరీక్షలు ముగిసిపోయి సెలవులొచ్చిన విద్యార్థిలా తన పరిస్థితి ఉందని నాని చెప్పడం విశేషం.
Please Read Disclaimer