తనపై ట్రోలింగ్ కు నాని రియాక్షన్!

0బిగ్ బాస్ -2 క్లైమాక్స్ కు చేరుకుంటోన్న కొద్దీ వివాదాలు ముసురుకుంటున్న సంగతి తెలిసిందే. గీతా మాధురి ముద్దుల ఎపిసోడ్ మొదలు బిగ్ బాస్ లో కౌశల్ ఆర్మీపై బాబు గోగినేని కామెంట్స్ వరకు …షోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తాజాగా షో నుంచి నూతన్ నాయుడు ఎలిమినేషన్ పై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ప్రేక్షకుల ఓటింగ్ కు విలువ లేదని ఎక్కువ ఓట్లు వచ్చినా…నూతన్ ను రీఎంట్రీ పేరు చెప్పి ఎలిమినేట్ చేశారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. గీతామాధురి తనీష్ లలో ఎవరో ఒకరిని విజేతగా ప్రకటించడానికి నూతన్ ను బిగ్ బాస్ నిర్వాహకులు హోస్ట్ నాని కలసి బయటికి పంపించారని ట్రోల్ చేస్తున్నారు. హౌస్ లో అందరినీ నాని సమానంగా చూడటం లేదని కౌశల్ కు నాని భయపడుతున్నాడని కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ట్రోలింగ్ పై నాని స్పందించాడు. తనకు అందరూ సమానమే అని తనక పక్షపాతం లేదని తనను నమ్మాలని నాని ట్వీట్ చేశాడు.

ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలని ట్విటర్ లోకి వచ్చానని చెప్పాడు. ఈ విధంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ‘బిగ్బాస్’ బృందం తనకు చెప్పిందని కానీ ఇవ్వకుండా ఎలా ఉండగలనని నాని అన్నాడు. షో విషయంలో ప్రేక్షకులలో కొందరు తన వల్ల బాధపడి ఉంటే క్షమించాలని కానీ తన కోణం నుంచి ఆలోచించాలని నాని అన్నాడు. ఇష్టమైన హౌస్మేట్ లను ప్రత్యేకంగా చూసుకోవాలని ప్రేక్షకులు భావిస్తున్నారని ఓ హోస్ట్గా తనకు అందరూ సమానమేనని అన్నాడు. ఆ క్రమంలో తాను పక్షపాతంతో ఒకరికి మద్దతుగా వ్యవహరిస్తున్నానని అనిపించొచ్చని అన్నాడు. ఓటింగ్ ఎలిమినేషన్ విషయాల్లో తన ప్రమేయం ఉండదన్నాడు. ఓ నటుడిగా వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు ది బెస్ట్ ఇవ్వాలన్నదే తన ఉద్దేశమని అన్నాడు. తనను ద్వేషించినా ప్రేమించినా..అందరూ తన కుటుంబ సభ్యులేనని తనను అపార్థం చేసుకోవద్దని కోరాడు.